ప్రస్తుత మీ చైతన్యమనేది మూర్తమైన పదార్ధం కాదు. పైగా సర్వవ్యాపకమైన తత్త్వమది. అలాంటప్పుడీ
శరీరమనే ఉపాధిలో అది ఎలా ప్రవేశించగలిగింది. ప్రవేశించకపోతే ఎలా భాసించ
గలిగింది. కాబట్టి ఈ చెప్పిన దర్పణ దృష్టాంతమెంత మాత్రమూ చెల్లనేరదని ఆక్షేపణ
వస్తుంది. దీనిని సవరించటానికా అన్నట్టు వేరొక దృష్టాంతాన్ని కూడా సెలవిస్తారు.
శంకర భగవత్పాదులు. అదే ఘటాకాశ దృష్టాంతం ఒక కుండ మనమారు బయట
పెట్టి చూస్తే అందులో మనకొక ఖాళీ కనిపిస్తుంది. అది ఆ కుండ మేరకే పరిమితమై
కనిపిస్తుంది. అలా కనిపించిన మాత్రాన ఆ కుండలో ఉన్న ఖాళీనే ఖాళీ అనగలమా.
ఖాళీ అనేది అంతటా ఉంది. కుండ లోపలా ఉందది. వెలపలా ఉంది. మహాకాశమే
గాని అది ఘటాకాశం కాదు. అంతటా ఉన్న ఆకాశమే ఘటంలో కూడా సంక్రమించ
గలిగింది. రూపమంటూ లేకపోయినా రూపమున్న పదార్ధం మాదిరే ప్రవేశించిందది.
ఆ మాటకు వస్తే అసలది ప్రవేశించనే లేదు. అమూర్తమైనది మూర్తంలో ఎలా
ప్రవేశించగలదు. అమూర్తమనే సరికది వ్యాపకమవుతుంది. వ్యాపకం వ్యాప్యంలో
ఎప్పటికీ ఇమడ లేదు. కాబట్టి ఆకాశం ఘటంలో ప్రవేశించిందనే మాట పొరబాటు.
నిజానికి ఘటంలో ఆకాశం కాదు. ఆకాశంలోనే ఘటం ప్రవేశించింది. ఒకదాని
చర్య మరొక దాని కారోపిస్తున్నాము మనం. అది మన భ్రాంతి, ఘటమనేది
ఆకాశంలోకి రాగానే ఆ ఘటం మేర కొక ఆకాశం కనిపించింది మనకు. ఆ మేరకే
చూచి దాన్ని ఘటాకాశమన్నాము మనం. ఘటాకాశమనీ మహాకాశమనీ
రెండాకాశాలు లెవెక్కడా. ఉన్నదెప్పుడూ ఒకే ఒక ఆకాశం. ఘటమనే ఉపాధి
మధ్యలో రావటం మూలాన ఒకే ఆకాశం రెండుగా చీలి మనకు కనిపిస్తున్నది.
కేవల ముపాధి జన్యమే గాని అది వస్తు ధర్మం కాదు.
అలాగే ప్రస్తుత మీ శరీరం కూడా ఘటంలాంటి ఒక ఉపాధి. కర్మ వశాత్తూ ఇది చిదాకాశంలోకి దూసుకు రావటం మూలాన అఖండమైన ఆ చైతన్యం ఖండ రూపంగా భాసిస్తున్నది. ఆకాశంలాగా చైతన్యం కూడా రూప రహితమే. అయినా ఈ శరీర సంపర్కం కారణంగా ఒక రూపమేర్పడింది దానికి. వాస్తవంలో ఇది దాని రూపం కాదు. శరీర రూపం. శారీరకమైన రూపం మన అజ్ఞానం వల్ల దాని కారోపించాము. తన్మూలంగా అది శరీరంలో బందీ అయినట్టు మనకు భాసిస్తున్నది. వాస్తవానికది శరీరంలో లేదు.
Page 35