అంచేత చివరకు ఫలితాంశమేమంటే ప్రపంచమని మన చుట్టూ ఏదేది కనిపిస్తున్నదో ఏదేది మన లోపల అనిపిస్తున్నదో అదంతా వాస్తవంలో ఏదో గాదు. ఆ ఈశ్వర చైతన్యమే. ఆ చైతన్యమే ఒక నర్తకుడిలాగా అనేక భూమికలు ధరించి మనకిలా భాసిస్తున్నది. “మూలకారణ మేక మేవ ఆ అంత్యాత్కార్యాత్తేన తేనకార్యా కారేణ నటవత్సర్వ వ్యవహారా స్పదత్వమ్ భజతే” అని ముక్తకంఠంతో చాటారు భగవత్పాదులు. నటుడనేవా డొక్కడే అయినా పెక్కు పాత్రలు ధరిస్తాడు. పెక్కు రీతులలో అభినయిస్తాడు. అయితే ఎన్ని పాత్రలు ధరించి ఎన్ని విధాల అభినయించినా అన్నింటిలో వున్నదొకే ఒక పురుషుడు. అలాగే మొట్టమొదటిదైన అవ్యాకృతం Primordial matter దగ్గరి నుంచీ కట్టకడపటిదైన మానవ శరీరం దాకా అన్ని ఆకారాలూ ధరించి అన్నింటిలో ప్రవేశించి అన్ని వ్యవహారాలు నిర్వహిస్తూ ఉన్నది కూడా ఆ పారమేశ్వరమైన చైతన్యమొక్కటే. దాని విభూతి శకలాలే ఈ చరాచరప్రకృతి అంతా. దానికి బాహ్యంగా ప్రపంచమని చూపగల, చెప్పగల, పదార్థమంటూ ఒకటి ఏదీ కానరాదు. అంటే ప్రపంచమనేది కేవలం మిథ్యాభూతమే నని అర్థం.
జీవమిథ్యాత్వం
ఇక్కడికి మనం జగన్మిథ్యాత్వాన్ని నిరూపించగలిగాము. పోతే ఇక జీవ మిథ్యాత్వాన్ని నిరూపించవలసి వుంది. జీవుడు కూడా జగత్తులాగా మిథ్యా భూతమే. అయితే దానికీ దీనికి మిథ్యాత్వంలో ఒక చిన్న తేడా వుంది. చైతన్యం వికృతమైన రూపం జగత్తయితే అవికృతమైన రూపం జీవుడంటా రాచార్యులవారు. వికృతి అంటే మార్పు ఏమాత్రంగానీ మార్పు చెందకండా ఆ ఈశ్వరుడే జీవుడనే పేరుతో ఈ శరీరంలో ప్రవేశించాడని చెబుతున్నది శాస్త్రం. కనుక జగత్తులాగా అచేతనుడు కాడు జీవుడు. ఈశ్వరుడి లాగా చేతనుడు. చైతన్యమనేది ఇరువురికీ సమానమైన ధర్మం. ఎటు వచ్చీ ఈశ్వర చైతన్యం పరిపూర్ణమైతే ఇది శరీర మాత్ర పరిచ్ఛిన్నమయి భాసిస్తుంది. కనుకనే జగదీశ్వరులకు రెంటికీ కార్యకారణ సంబంధం చెబితే జీవేశ్వరుల కంశాంశి సంబంధం చెబుతారు వేదాంతులు. అంశి అంటే సమష్టి. అంశమంటే అందులో ఒకభాగం. దావానలం అంశి అయితే విస్ఫులింగమొక అంశం. మహా సముద్ర మంశి అయితే తరంగమనేది ఒక అంశం.
Page 33