#


Back

   దీనిని బట్టి మన కర్థమయిందేమిటి. అన్ని కారణాలూ ఒక్క ఈశ్వరుడే కాబట్టి ప్రపంచ నిర్మాణానికిక దేని అపేక్షాలేదు. సామగ్రీ అక్కరలేదు. సహాయమూ అక్కరలేదు ఈశ్వరుడు తన్ను తానే స్వయంగా మలుచుకొని ఈ చరాచర ప్రపంచంగా మనకు భాసిస్తున్నాడని తెలుసుకోవాలి మనం. ఒక బంగారమే తనపాటికి తాను హారనూపుర కేయూరాదులైన ఆభరణాలుగా మారి కనిపిస్తే ఎలా ఉంటుందో అలాంటిదీ ఇది. హారనూపురాదుల లాంటివే మనకు కనిపించే వన నదీ పర్వత సముద్రాదులైన పదార్థాలన్నీ. హారనూపురాదులన్నీ సువర్ణమయినట్టే అణువు మొదలు ఆకాశందాకా ఉన్న ఈ పదార్థాలన్నీ కూడా ఆ ఈశ్వర స్వరూపాలే. అంతకన్నా వేరు కావు.

   అయితే కారణ గుణాలే దాని కార్యంలో కనిపించాలనే సిద్ధాంతముంది గదా. ఈశ్వరుడే జగత్తు కంతా కారణమయినప్పుడీ జగత్తులో కూడా ఈశ్వర గుణాలు కనిపించాలి గదా. మరి అలాంటి లక్షణాలెక్కడ కనిపిస్తున్నాయని ప్రశ్న రావచ్చు. దీని కాచార్యుల వారిచ్చే సమాధానమిది. ఈశ్వర గుణాలీ ప్రపంచంలో ఎక్కడ దాఖలా అవుతాయనే ప్రశ్నేలేదు. అంతా ఈశ్వర స్వరూపమే అయినప్పుడిక దాఖలా అనే ప్రశ్నేముంది. ఎక్కడ బడితే అక్కడే తార్కాణ కావాలవి. అవుతాయి కూడా. అసలీశ్వరుడి గుణాలనే వేమిటి. గుణాలే అనుకొంటే అవి రెండే రెండున్నాయి. ఒకటి సత్తు. మరొకటి చిత్తు. సత్తంటే ఉండటమనీ చిత్తంటే ప్రకాశించటం లేదా కనిపించటమనీ అర్థం. ప్రపంచంలో నీవే పదార్థాన్నైనా పట్టి చూడు. అది ఉంటుంది. కనిపిస్తుంటుంది. చంద్రమండలానికి వెళ్ళినా సరే. అక్కడీ పదార్థాలు కూడా ఉంటాయి. నీ కంటికి కనిపిస్తుంటాయి. ఇంతకు మించి నీవెక్కడ గానీ చూడదగిన విశేషమేదీ లేదు. అదేమిటి. పొడుగూ-పొట్టీ-లావూ-సన్నమూ- ఎరుపూ నలుపూ- మంచీ-చెడ్డా- ఎన్నో ఉన్నాయి గదా విశేషాలని శంకించవచ్చు. అవి కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అంతకంటే విశేషమేముందని. విశేషమని ఏది చెప్పినా చివరకది కూడా ఉండవలసిందే. కనిపించవలసిందే. ఈ ఉనికినే అస్తి అన్నారు. కనిపించటాన్నే భాతి అన్నారు వేదాంతంలో. అస్తి భాతి అన్నా - సత్తా స్ఫురత్తలన్నా- సచ్చిత్తులన్నా మూడూ పర్యాయాలే. ఈ సచ్చిత్తులే ఇంతకూ ఈశ్వర గుణాలనేవి. ఈ గుణాలే ఈశ్వర కార్యమైన ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ బడితే అక్కడ రాజ్యమేలుతున్నాయి. అలాంటప్పుడిదంతా ఈశ్వర స్వరూపమేనని చెప్పటంలో అభ్యంతరమేముంది.

Page 32