తాదాత్మ్య మంటే రెండూ ఒక్కటేనని అర్థం. కాబట్టి ఇంతకూ కార్యమనేది ఒకటి ఎప్పుడూ రాలేదు, పోలేదు. అది నూటికి నూరు పాళ్ళు దాని కారణాని కనన్యమని సిద్ధాంతం.
పోతే ప్రస్తుత మీ సిద్ధాంతాన్ని మనం జగదీశ్వరులనే మూలతత్త్వాల కన్వయించు కోవలసివుంది. జగదీశ్వరులకున్న సంబంధం కూడా ఇలాంటి కార్యకారణ సంబంధమే నని నిరూపించాము. అందులో జగత్తు కార్యమైతే ఈశ్వరుడు కారణం. కారణమంటే ఇది మిగతా కారణాలవంటిది కూడ కాదు. ఇందులో ఒక విశేషముంది. లోకంలో మనం చూచే కారణాలన్నీ ఒక దానికి కారణమైతే - మరొక దానికి కార్యమవుతాయి. ఉదాహరణకు ఒక కొయ్యబల్లకు కారణమైతే చెట్టుకది కార్యం. మరి చెట్టు కొయ్యకు కారణమైతే విత్తనానికది మరలా కార్యం. ఇలా ఎంతదూరమైనా పరుగెడుతుందీ కార్యకారణ పరంపర. మొత్తం మీద కార్యంగాని కారణమంటూ ఒక్కటీ లేదు ప్రపంచంలో. ప్రస్తుత మీ ఈశ్వరుడనే కారణమలాంటిది గాదు. మొత్తం ప్రపంచానికే కారణం కాబట్టి అది ఇక దేనికీ కార్యం గాదు. కార్యంగాని కారణమది. అందుకే దాన్ని ఆది కారణమనీ - మూలకారణమనీ కారణ కారణమని వర్ణిస్తారు. వేదాంతులు.
అంతేకాదు. పైన చెప్పినదే కాక మరొక విశేషం కూడా కనిపిస్తుందీ ఈశ్వర కారణంలో అదేమిటంటే అసలు కారణమనేది ఒకటిగాదు. అది మూడు విధాలు. ఒకటి ఉపాదానం Material రెండు నిమిత్తం Agent. మూడు సహకారి Instrument. కుండకు మట్టి ఉపాదానమైతే కుమ్మరి నిమిత్త కారణం. పోతే దండమూ-చక్రమూ, జలమూ-సూత్రమూ - ఇలాటివన్నీ సహకారులు ఇవి మూడూ కలసి పని చేసినప్పుడే ఏ కార్యమైనా రంగంలోకి వచ్చేది. లోకంలో ఇవి మూడూ దేనిపాటి కది వేరు వేరుగా ఉంటాయి. ఉపాదానం నిమిత్తం కాదు. నిమిత్తం సహకారి కాదు. ఒకదానికొకటి విలక్షణం. కానీ ప్రస్తుతం ఈ ఈశ్వరుడి విషయంలో అలా కాదు. మూడూ ఒక్కటే. అంటే అర్థం. ఉపాదానమైనా అదే. నిమిత్తమైనా అదే. సహకారి అయినా అదే. ఏమి కారణం. చరాచర ప్రపంచానికంతటికీ కలిపి అది ఒక్కటే కారణమని గదా నిరూపించాము. ఒక్కటే నన్నప్పుడిక వేరొక కారణమనే గంధమే లేదు. అంచేత మూడింటి పనీ అది ఒక్కటే చేయవలసి వస్తుంది.
Page 31