అగపడాంటే దాని నివతలికి తెచ్చి మడత విప్పి బాగా పరచి చూడాలి. అప్పుడందులోని ప్రతి ఒక్క మర్మమూ మనం చక్కగా గుర్తించవచ్చు. అలా గుర్తించామంటే అప్పటికప్పుడది క్రొత్తగ సృష్టి అయిందనా అర్థం. ఉన్నదేదో అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఎటు వచ్చీ అప్పట్లో అది వ్యక్తం కాలేదు. ఇప్పుడయింది. అంత మాత్రమే.
ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక కొందరు కార్యమనేది క్రొత్తగా ఆవిర్భవస్తున్నదంటే మరి కొందరు పరిణమిస్తున్నదని వాదిస్తారు. రెండు వాదాలు అర్థం లేనివన్నారు శంకర భగవత్పాదులు. ఆరంభ వాదాన్ని ఒప్పుకొంటే అంతకుముందు లేని పదార్థమొకటి సరిక్రొత్తగా ఊడిపడిందని చెప్పవలసి వస్తుంది. పరిణామ వాదాన్ని ఒప్పుకొంటే ముందున్న రూపం మారిపోయి క్రొత్త రూపమొకటి ఏర్పడిందని చెప్పవలసి వస్తుంది. ఏ విధంగా చెప్పినా అది అశాస్త్రీయమే. ఎందుకంటే లేని పదార్థమెప్పుడూ రాదు. ఉన్న పదార్థమెక్కడికీ పోదు. ఒక పదార్థమిప్పుడుందంటే ఇంతకు ముందు కూడా ఉందది. ఇక ముందు కూడా ఉండబోతుంది. ఏదీగానీ నిరన్వయమూ అభావాంతమూ కావటానికి లేదు. ఇది సర్వులూ ఒప్పుకొన్న సిద్ధాంతం. కాబట్టి ఆరంభమూ Creation కాదిది -పరిణామమూ Evolution కాదు.
అయితే మరి కార్యమనేది ఎలా వచ్చిందని ప్రశ్న. దీనికి వివర్తమని Manifestation జవాబిస్తారు జగద్గురువులు. వివర్తమేమిటి. కారణమే మరొక భంగిమలో కనిపిస్తే దానికి వివర్తమని పేరు. ఇందులో చమత్కారమేమంటే ఏ భంగిమలో కనిపించినా - అది కారణమే గాని మరొకటి గాదు. కారణ ద్రవ్యాన్ని విడవకుండా అంటిపెట్టుకొనే ఉంటుందా రూపం. ఎక్కడికక్కడ రూపాలు మారినా అది మాత్రమను స్యూతంగా మనకు దర్శనమిస్తూనే ఉంటుంది గానితెగిపోవటమంటూ ఉండదు. తెగిపోయిందంటే అది ఇక మన కంటికెక్కడా కనపడగూడదు. ఏదీ అలా కనపడకుండా ఎక్కడ పోయింది. ఎప్పుడు చూచినా ఎక్కడ చూచినా - దాని కార్యరూపాలలో అదే మనకు సాక్షాత్కరిస్తున్నదాయె. అలా చివరదాకా అదే ఉన్నప్పుడిక ఏదిగాని క్రొత్తగా వచ్చిందేమిటి. మారిందేమిటి. వచ్చినట్టు మారినట్టు కేవలం భాసిస్తున్నదంత మాత్రమే. ఇదుగో ఇలాంటి భాసకే వివర్తమని నామకరణం చేశారు వేదాంతులు. దీనికే తాదాత్మ్య సంబంధమని కూడా నామాంతరం. ఈ తాదాత్మ్య సంబంధం తప్ప మరి ఒక సంబంధమే లేదు కార్యకారణాలకు.
Page 30