#


Back

   మరి కొన్నిటిలో కేవల మస్పష్టమయి పోతుంది. ఇంతకు స్పష్టాస్పష్టతలలోనే తేడా గాని అసలు దాని లక్షణాలందులో లేక గాదు. అసలా లక్షణాలే లేకుంటే దీనికది కారణమనీ-దానికిది కార్యమనీ ఎలా చెప్పగలం. చెప్పగలిగామంటే రెండింటికీ ఏదో ఒక సాజాత్యముంటేనే గదా. సాజాత్యం లేదంటావో మట్టినుంచే కుండ రావటమేమిటి. విత్తనం నుంచే వృక్షం రావటమేమిటి. విజ్జోడుపడి ఒకదాని నుంచి వేరొకటి రావచ్చు గదా. కాని అలా జరగటం లేదెక్కడా. మట్టినుంచే ఘటం వస్తుంది. విత్తునుంచే చెట్టు వస్తుంది. అలాగే వస్తున్నాయంటే అప్పటికీ కార్యమనేది అంతకు పూర్వమే ఉండకతప్పదు. ఉండకపోతే ఒక్కసారిగా అది ఎలా ఊడి పడుతుంది. పడిందని చెప్పావంటే అభావం నుంచి భావం వస్తుందని చెప్పినట్టవుతుంది. అభావం నుంచి భావమెప్పుడూ రాదు. భావం నుంచే భావమేర్పడుతుంది. అభావం నుంచే వచ్చేట్టయితే ఘటం తాలూకు అభావం ఒక మట్టిలోనే ఏమి పటంలో మఠంలో కూడా ఉంది. మరి వాటిలో దేనిలో నుంచీ రావటం లేదేమి ఘటం. కాబట్టి ఘటమనే కార్యమంతకు ముందు నుంచీ దాని కారణమైన మృత్తికలోనే గుప్తమయి ఉండాలి. ఇలా కార్యం కారణంలో గుప్తమయి ఉండటం మూలాన్నే మరలా కార్యంలో ఎక్కడ చూచిన దాని కారణ గుణాలనే మనం గుర్తించగలగటం. అంటే ఏమన్నమాట. కార్యమని ఇప్పుడు మనమేది చూస్తున్నామో అది మొదటి నుంచీ దాని కారణమే గాని అంతకన్నా విశేషమేమీ లేదు.

   ఒకవిధంగా చెబితే అవ్యక్తమైన Latent రూపం వ్యక్తం Patent కావటాన్నే కార్యమని మనం వ్యవహరిస్తున్నాము. అవ్యక్తంగా ఉన్నప్పుడు దానికి కారణమని పేరు. అదే వ్యక్తమయి కనిపిస్తే దానికి కార్యమని పేరు. వ్యక్తావ్యక్త దశలలోనే మార్పుగాని వస్తు స్వరూపంలో మార్పులేదు. అక్కడ ఉన్న వస్తువొక్కటే. దానికి చెందిన సూక్ష్మరూప మొకటైతే-స్థూల రూపం మరొకటి. ఇంతెందుకు ఒక పెద్ద కంబళముందనుకోండి. అందులో చిత్రవిచిత్రమైన రంగులూ రేఖలూ ఎన్నో ఉండవచ్చు. ఎన్నో గజాల ఆయామమూ విస్తారమూ, కలిగిందేకావచ్చు. కానీ చుట్టచుట్టి మడిచి ఒక మూల పడవేసి ఉన్నంతవరకూ ఏమీ ప్రయోజనం లేదు. అందులో ఉన్న విశేషమేదీ మనకంటి కగపడదు.

Page 29