#


Back

   "కారణ గుణాః కార్యమను ప్రవిశంతి" అని వారే సిద్ధాంతం చేశారు. ఇదే సిద్ధాంతమైననాడిక కారణానికి భిన్నంగా కార్యమనేది ఎలా ఉండగలదని ప్రశ్నిస్తారు భగవత్పాదులు. ఒక ఘటమనే కార్యముందంటే అందులో ఎంత దూరం తడవిచూచిన మనచేతికి తగిలేది మృత్తికే. అంతా మృత్తిక గుణాలే అయినప్పుడిక ఘటమనేది ఎక్కడ ఉంది. అయితే మృత్తికకు భిన్నంగా ఒక లావుపాటి గుండ్రని రూపం మనకు గోచరిస్తుంది గదా అని అడగవచ్చు, ఆ రూపమూ దానిని వర్ణించే ఘటమనే నామమూ - ఇవి రెండూ నామమాత్రమేగాని వాస్తవంలో అక్కడ ఉన్నది మృత్తిక అనే మూలద్రవ్యమే. మృద్గుణాలకంటే అదనంగా ఏ గుణాలూ లేవక్కడ. ఒకవేళ ఉన్నట్టు కనిపించినా మరలా అదేమిటని తడవిచూస్తే మృత్తికగానే గుర్తించగలం, ఇలా కారణ స్వరూపాన్ని దాని కార్యంలో గుర్తించటానికే ప్రత్యభిజ్ఞ Recognition అని పేరు. ప్రత్యభిజ్ఞా దృష్టితో చూస్తే అంతా కారణమే. కార్యమనే పొలకువే కానరాదు చివరకు.

   అయితే ఇది మృద్ఘటాదులైన కొన్ని దృష్టాంతాలలో సరిపడితే పడవచ్చుగాని అన్ని దృష్టాంతాలలో సరిపడుతుందని ఏమిటి నమ్మకం. ఆ మాటకు వస్తే క్షీరదధి దృష్టాంతముంది. అలాగే బీజవృక్ష దృష్టాంతముంది. అవికూడా కార్యకారణాలే గదా. మరివాటిలో మనకిలాంటి ప్రత్యభిజ్ఞ కలగటం లేదే అని ప్రశ్నరావచ్చు. అందులోకూడా కలుగుతుందనే అంటారు స్వామివారు. కార్యకారణ సంబంధమున్న చోట అంతా ప్రత్యభిజ్ఞ కలిగి తీరవలసిందే. అయితే కొన్నింటిలో అది ఎందుకు కనిపించటం లేదంటే పరిణామ విప్రకర్షం Distance in Evolution వల్ల నంటారాయన. విప్రకర్షమంటే దూరమని అర్థం. కారణానికీ-కార్యానికీ-మధ్య పరిణామ క్రమంలో ఎన్నో మజిలీలు Stages తటస్థపడ్డాయి. ఇవి గోడలమాదిరడ్డు తగలటంవల్ల ఒక దానికొకటి దూరమయిపోయి తన్మూలంగా కార్యాన్ని చూడగానే దానికారణ గుణాలను తటుక్కున పోల్చుకోలేక పోతున్నాము. మనం పోల్చుకోలేక పోయినా అవి మాత్రమెక్కడికీ పరారయిపోవు. అక్కడే మరుగుపడి ఉంటాయి. కొంచెం లోతుకు దిగి అంచెలవారిగా విచారణ సాగిస్తేచాలు. మరలా దాని స్వరూప మందులోనే మనకు క్రమంగా బయటపడుతుంది. అసలు విషయమేమంటే కొన్నిటిలో కారణమతి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నింటిలో స్పష్టాస్పష్టంగా భాసిస్తుంది.

Page 28