#


Back

   సత్తాలు వేరుగా లేకపోతే ఇక వస్తువులనేవి రెండుండటానికి వీలులేదు. రెండు వస్తువులుండాలంటే వాటి సత్తాలుకూడా రెండుండి తీరాలి. ఇక్కడ మనకు కనిపించేది ఒక్కటే సత్తా. సత్తా ఒక్కటే అయి పదార్థాలు రెండెలా అవుతాయి. కాబట్టి వస్తువనే దొక్కటే. అయితే ఆ రెండవ దేమిటని అడగవచ్చు. అది వస్తువు కాదు. దాని ఆభాస. ఒకటి ఉండి కనిపిస్తే అది వస్తువు. లేకుండానే కనిపిస్తే ఆభాస. ఒక జలాశయంలో జలం కనిపిస్తుందంటే అది వాస్తవంగా అక్కడ ఉండే కనిపిస్తున్నది. మరి ఎండ మావులలో అలా కాదు. అక్కడ నీరనే పదార్థం నిజంలో లేకపోయినా పొంగి పొర్లుతున్నట్టే భాసిస్తుంది. నిజంగా ఉన్నదక్కడ సూర్యకిరణాలేగాని నీరు గాదు. అదే మనకు దూరానికి జలంలాగా భాసిస్తున్నది. దీనినిబట్టి మనం గ్రహించవలసిందేమిటి. కారణ ద్రవ్యంకంటే భిన్నంగా దాని కార్యం ఉండబోదు. కారణం వస్తు Substance వైతే కార్యమనేది దాని ఆభాస Appearance మాత్రమే.

   అయితే ఎంత ఆభాస అయినా మనకంటికి కనిపిస్తున్నది గదా అని అడగవచ్చు. నీవు కనిపిస్తున్నదని చెప్పేది అసలు కార్యమే కాదు పొమ్మంటారు శంకరులు. కార్యంకాక మరేమిటి. కారణమే ఒకానొక రూపంలో కనిపిస్తుంటే అది చూచి నీవు కార్యమని భ్రమపడుతున్నావు. ఇంతెందుకు. ఒక సర్పముంటుంది. అది చుట్ట చుట్టుకొని పడుకొన్నప్పుడొకవిధం- కదలి ముందుకు పోతున్నప్పుడొక విధం-పడగ ఎత్తి బుసకొడుతున్నప్పుడొక విధం- పైనబడి కరవ వచ్చేటప్పుడొక విధం. నాలుగు దశలలో నాలుగు రూపాలుగా కనిపిస్తుందది. ఎన్ని రూపాలుగా కనిపించినా అక్కడ ఉన్నదొకే ఒక సర్పం. ఒక్కొక్క దశలో ఒక్కొక్క సర్పం లేదు. ఒకే సర్పమెత్తిన అవతారాలవి. రూపాలవి. ఈ రూపానికే సంస్థాన Constitution or phase మని పేరు పెట్టారు భగవత్పాదులు. కారణం తాలూకు సంస్థానం చూచి మనం కార్యమని దానికొక క్రొత్తపేరు పెట్టాము. ఎంత పెట్టినా క్రొత్తగా ఒకటి ఏదీ రాలేదు. ఉన్నదల్లా ఒక్క కారణద్రవ్యమే. దానికదనంగా మరేది కనిపించినా అది కేవలం దాని రూపమూ Form లేదా సంస్థానమే Phase. కాబట్టి దానికన్నా అది వేరుగాదు.

   వేరుగాదని చెప్పటానికి మరొక నిదర్శనంకూడా ఉంది మనకు. కారణానికేగుణా లున్నవో అవే దాని కార్యంలోనూ కనిపిస్తాయి. అంతకుమించి అదనంగా మనకందులో ఏదీ కనిపించదు. ఇది వేదాంతులే గాక భేదవాదులైన తార్కికులు కూడా అంగీకరించిన సత్యం.

Page 27