అనవస్థ అంటే ఎక్కడికీ నిలవక పోవటం. కాబట్టి ఐశ్వరమైన ఈ జ్ఞానానికి సాక్షి అక్కరలేదు. అది దాని పాటికది ప్రకాశిస్తూ ఈ సమస్త విశ్వాన్నీ ప్రకాశింపజేస్తున్నది. మొత్తానికి అది ఉంటేనే ఈ ప్రపంచముంది, లేకుంటే లేదు.
రెంటికీ ఇలాంటి అవినాభావ సంబంధముండటం మూలాన్నే ఈశ్వరుడికి భిన్నంగా అసలీ జగత్తనేది లేదు పొమ్మన్నారు అచార్యులవారు. ఎంచేతనంటే అది ఉంటేనే ఇది ఉందని ఎప్పుడన్నామో అప్పుడా రెండూ ఒక దానికొకటి కార్యకారణా లవుతాయి. రెండు పదార్ధాలలో ముందుగా సిద్ధమై ఉన్నదేదో అది కారణం Cause. తరువాత దాని నుంచి ఉద్భవించేదేదో అది కార్యం Effect. ప్రస్తుత మీశ్వరుడూ జగత్తూనని రెండే ఉన్నాయి పదార్ధాలు. అందులో ఈశ్వరుడనేది సాక్షి కాబట్టి అది ముందే సిద్ధమయి ఉండాలి. ముందున్నది గనుకనే అది కారణం. పోతే అందులో నుంచి రావలసిందే కాబట్టి ఈ జగత్తంతా దానికి కార్యం.
కార్యకారణాలు రెండింటిలో కారణానికి భిన్నంగా దాని కార్యమనేది ఉండబోదని అద్వైతుల సిద్ధాంతం. దీనికే అనన్యత్వవాద Doctrine of total Identity మని పేరు. అనన్యత్వమంటే అన్యం గాకపోవటమే. కార్యమనేది దాని కారణంకన్నా అన్యం కాదు. దీనికి దృష్టాంతంగా ఒక మట్టినీ కుండనూ తీసుకొని చూడవచ్చు. మట్టి కారణమైతే కుండ దానికి కార్యం. మట్టిని విడిచి కుండ ఎక్కడా లేదు. ఎందుకంటే రెండింటికీ గూడా సత్తా Existence ఒక్కటే. కారణసత్తా ఏదో అదే దాని కార్యానికీ సత్తా. అంతకు మించి దీనికొక స్వతంత్రమైన సత్తా లేదు. కార్యకారణాలు రెండూ అప్రవిభక్త దేశకాలాలంటారు భాష్యకారులు అంటే ఏమన్న మాట. కారణమెంత మేరలో ఉందో అంత మేరలోనే ఉంటుంది కార్యం. అది ఎంత కాలముంటుందో ఇదీ అంత కాలమే ఉంటుంది. అంతేగాని దీనికొక విలక్షణమైన ఉనికి అంటూ లేదు. ప్రస్తుతం కుండ అనే పదార్థమొకటి ఉందని చెప్పామంటే ఎక్కడ ఉందది. మట్టి ఉన్నంతవరకే ఉంటుందది. మట్టి మన్నంతవరకే మనుతుంది. దాని సరిహద్దులను దాటి ఇది ఒక అంగుళం పోలేదు. పోతే కుండ అనేదే అసలు లేకుండా పోతుంది. కాబట్టి కారణసత్తాయే కార్యసత్తా. దానికి వ్యతిరిక్తమైన సత్తా దీనికెప్పుడూ లేదు.
Page 26