#


Back

   కానీ వచ్చిన ఇబ్బంది ఏమంటే మన జ్ఞానానికీ ప్రపంచమెంత ఉందో అంతా గోచరించటం లేదు. ఎంత కాలముంటుందో అంత కాలమూ భాసించటం లేదు. చూడబోతే దేశకాలాలనేవి రెండూ అడ్డుతగులుతున్నాయి. మన జ్ఞానానికి. వాటి రెండింటినీ అతిక్రమించి పోయేస్తోమత దీనికి కానరాదు. జ్ఞానమైనా ఇది కేవలం పరిచ్ఛిన్నమే Restricted గాని అభివ్యాపకం Pervasive కాదు. అలాంటప్పుడoడ పిండ బ్రహ్మాండాత్మకమైన ఈ సృష్టికంతటికీ అది సాక్ష్యమెలా ఇవ్వగలదు. ఇవ్వకపోతే ఆమేరకది అస్తిత్వాన్ని కోలుపోవలసిందే గదా.

   అంచేత ప్రపంచానికి సాక్షి జ్ఞానమే అయినా మనబోటి జీవుల జ్ఞానం కాదని తేలిపోయింది. పోతే ఇక జ్ఞానమనేది ఏది. ఏదో ఒక జ్ఞానానికి గోచరిస్తూనే ఉండాలని చెప్పా మీ ప్రపంచం. దేనికీ గోచరించకపోతే అసలిది అస్తిత్వానికే నోచుకోలేదు. దీనినిబట్టి మన జైవమైన జ్ఞానానికి భిన్నంగా మరి ఒక జ్ఞానముందని ఒప్పుకోక తప్పదు. అది మరలా నీ నా జ్ఞానంలాగా దేశకాల పరిచ్ఛిన్నమైతే ప్రయోజనం లేదు. వాటి రెండింటి అవధులనూ దాటి అనంతంగా వ్యాపించి పోవాలి. అలా వ్యాపిస్తే గాని అనంతమైన విశ్వానికది సాక్షిగా నిలబడలేదు. ఇదుగో ఇలాంటి సర్వవ్యాపకమైన జ్ఞానానికి Universal conscious ness ఈశ్వరుడని పేరు పెట్టారు. మన పెద్దలు. జీవ జగత్తులకు విలక్షణంగా ఈశ్వరుడనే మూడవ పదార్ధాన్ని ఒప్పుకోటానికిదే కారణం. ఇలాంటి ఒక ఐశ్వరమైన జ్ఞానం నిత్యమూ సాక్షిగా నిలిచి చూస్తుంటే దాని వెలుగులో ఈ చరాచర జగత్తూ మనకు జ్ఞేయరూపంగా ఇలా సాక్షాత్కరిస్తున్నది.

   సరే. జగత్తుకు జ్ఞానమనే సాక్షి ఒకటి కావాలన్నారు. బాగానే ఉంది. అయితే మరి ఈ జ్ఞానానికేమిటి సాక్షి. దానికి కూడా ఒక సాక్షి ఉండాలి గదా అని మరలా ఆక్షేపణ వస్తుంది. దానికి సాక్షి అక్కరలేదు పొమ్మన్నారు శంకర భగవత్పాదులు. అచేతనానికైతే సాక్షి అంటూ ఒకటుండి తీరాలి. ఎందుకంటే దానికి తానున్నాననే ప్రజ్ఞ లేదు. పోతే జ్ఞానమనేది జ్ఞేయ జగత్తులాగా అచేతనం కాదు. అది చైతన్యరూపమే. అలాంటి దానికి సాక్షి దేనికి. దీపానికి మరొక దీపంతో ఎలా నిమిత్తం లేదో స్వయంగా సాక్షి అయిన జ్ఞానానికి కూడా మరొక సాక్షితో నిమిత్తం లేదు. ఉంటుందని పట్టు పడితే దానికేమిటి సాక్షి దానికేమిటని ప్రశ్న వస్తుంది. అది అనవస్థ అనే దోషానికి దారి తీస్తుంది.

Page 25