జగన్మిథ్యాత్వం
జగత్తంటే ఏమిటి. నామ రూపాత్మకంగా మనకండ్ల ముందు పరిచినట్టు కనిపించే ఈ చరాచర ప్రపంచమే. పృథివ్యాదులైన పంచభూతాలతో నిర్మాణ మయిందిది. పంచభూతాలూ అచేతనాలే. Insentient. కాబట్టి పాంచ భౌతికమైన ఈ ప్రపంచం కూడా అచేతనమే. అచేతన మెప్పుడయిందో అప్పుడు దీనికి తానున్నాననే ప్రజ్ఞ Consciousness లేదు. ఉన్నాననే జ్ఞానం లేకపోతే ఏదిగాని ఉండలేదు. ఒకటి ఉండాలంటే ఆ ఉనికి కొక సాక్షి Spectator కూడా ఉండి తీరాలి. అసాక్షికమైన ఉనికి సృష్టిలోనే అసంభవం. మరి సాక్షి అనేది ఏదో గాదు జ్ఞానమే. ఏదో ఒక జ్ఞానానికి గోచరమవుతూనే ఉండాలి ప్రపంచమంతా. జ్ఞానానికి గోచరంకాదు. అయినా ప్రపంచ ముందనే మాట హేతువాదానికి నిలవదు. అది ఎలాంటిదంటే రూపమనేది కనిపిస్తూ ఉంది. నాకు మాత్రం రెండు నేత్రాలూ లేవని చెప్పటంలాంటిది. నేత్రాలు లేకపోతే ఎలా చూడగలిగావు. చూడకపోతే ఎలా చెప్పగలిగావు. కాబట్టి అచేతనమైన ప్రపంచం తనపాటికి తానుండటమనేది అసంభవం. ఉండాలంటే ఏదో ఒక జ్ఞానానికి విషయ Object మవుతూనే ఉండాలది.
అయితే ఈ విషయంలో ఇంకా సందేహమనేది వెంటాడుతూనే ఉంటుంది మనలను. మన జ్ఞానానికి గోచరిస్తేనే ప్రపంచముండటమేమిటి. ప్రపంచమనేది ఒకటి ఉంటేగదా మనం దాన్ని చూస్తున్నాము. మనం దాన్ని సృష్టించటం లేదు గదా. మనం పుట్టకముందునుంచీ ఉన్నదది. మనం చచ్చిన తరువాత కూడా ఉండబోతుంది. అలాంటప్పుడు జ్ఞానముంటే అది ఉండటమేమిటి. అర్థంలేని మాట. మీదు మిక్కిలి అది ఉంటేనే జ్ఞానంచేత దాన్ని మనం గ్రహించగలుగుతున్నామని మనకందరికీ కలిగే పెద్ద సందేహం.
వేదాంత మార్గంలో ఇది చాలా విషమమైన ఘట్టం Dilemma. ఈ ఒక్క అంశం మీదనే ఎటూ పరిష్కరించ లేక లోకంలోని తత్త్వవేత్త Philosphers లందరూ చెదరిచేరి ఒక మార్గం పట్టిపోయారు.
Page 23