నిజంగానే సత్యమైననాడది మన అనుభవానికి కూడా రావాలి గదా. ఇదిగో అలా వస్తుందా రాదా అని తేల్చుకోటానికే ఈ విచారణ. విచారణ లేకుండా అంగీకరిస్తే అది నదీ తీరంలో ఫల వృక్షాలున్నాయనే మాటలాగా ఒక కట్టు కథ అయినా కావచ్చు. అలాగని శాస్త్రనిరపేక్షంగా విచారణ సాగించామంటే అది ఒక శుష్కతర్కమైనా కావచ్చు. రెండూ మనకు నిష్ప్రయోజనమే. విచార శూన్యమైన శాస్త్రమూ పనికిరాదు. శాస్త్రాధారం లేని విచారణ పనికిరాదు. ఎప్పుడు గానీ శాస్త్రం చెప్పిన విషయాన్ని ఆధారం చేసుకొని సక్రమంగా విచారణ సాగిస్తూ పోవాలి. అలాగయితేనే అది ఒక నిశ్చయాత్మకమైన- సప్రయోజనమైన - విజ్ఞానాన్ని మనకందిస్తుందంటారు భగవత్పాదులు.
అందుకేనేమో ఆచార్యుల వారసలు స్వతంత్రమైన శాస్త్ర గ్రంథమేది గానీ రచించలేదు. అంతకు పూర్వం నుంచీ ప్రచారంలో ఉన్న శాస్త్రాలకే అపూర్వమైన భాష్యాలు రచించి వెళ్ళిపోయారు. భాష్యమంటే ఏదో గాదు. ఇలాంటి విచారణే. ఈ విచారణకే మీమాంస అనీ-మననమనీ-తర్కమనీ-యుక్తి అనీ - ఉపపత్తి అనీ చాలా నామధేయాలున్నాయి. “వేదాంత వాక్య మీమాంసా - వాక్యార్థ విచారణా శ్రవణ వ్యతిరేకేణ మననమ్ విదధతీ తర్కమప్యత్రా దర్తవ్యమ్ దర్శయతి – ఆగమోపపత్తిభ్యామ్ నిశ్చితోర్ధః" అని ఆయా సందర్భాలలో అన్ని మాటలూ ప్రయోగిస్తూనే వచ్చా రాచార్యులవారు. "ఆగమోపపత్తి భ్యామ్ నిశ్చతోర్థః శ్రద్ధేయో భవత్యవ్యభిచారాత్" అని ఘంటా పథంగా చాటారాయన. శాస్త్రం ప్రతిపాదించిన విషయం సరియైనదా కాదా అని తేల్చుకోవాలంటే దాని కుపపత్తిని కూడా జోడించాలట. అప్పుడుగాని మనకది అవ్యభిచారి Unimpeachable అయిన సత్యమని నిర్ధారణ కాదు. అంచేత ప్రస్తుత మీ అద్వైత వేదాంతం పేర్కొనే సత్య-మిథ్యా విభాగం కూడా ఎంత వరకు సమంజసమో మనం విచారణ మూలంగానే తేల్చుకోవలసి ఉంది.
సత్య-మిథ్యా విభాగాలలో కూడా మొదట మిథ్యా విభాగాన్ని గూర్చే మనం చర్చిద్దాము. మిథ్య అనేది ఏదో తెలిసిపోతే ఇక మిగిలింది సత్యమని మనం చెప్పకుండానే తెలుసుకోవచ్చు. పైగా వేదాంత సంప్రదాయం కూడా అదే. కాదు కాదని ప్రతిషేధిస్తూనే తత్త్వాన్ని గ్రహించాలంటారు సంప్రదాయజ్ఞులు. కాబట్టి విచారణే మనం మొదట సాగించవలసింది. అందులోనూ జగన్మిథ్యాత్వం మీద ఆధారపడివుంది జీవ మిథ్యాత్వం. అంచేత ప్రప్రథమంగా మనం జగత్తుయొక్క మిథ్యాత్వాన్ని గురించే ఆలోచిద్దాము.
Page 22