మరలా దానిని మన లోకానుభవంతో సరి పోల్చుకొని చూచే అవకాశముండి తీరాలి. ఇలాంటి అవకాశం సాపేక్షమైనవి కాబట్టి మిగతా శాస్త్రాలలో కావలసినంత ఉంది. పోతే ఈ వేదాంత విషయమలాంటిది కాదు. ఇది నిరపేక్షమైన శాస్త్రం. మనతో సహా మనంచూచే ఈ ప్రపంచమంతా లేదని కొట్టివేస్తున్నది. ఏదీ లేకపోతే ఇక ఉన్న సత్యాన్ని మనం సరిపోల్చుకొని చూడటమెలాగ. పోల్చుకో లేకపోతే అది యధార్థమో కాదో మనకేమిటి నమ్మకం. మనకు గాకపోయినా మన పూర్వుల కనుభవ గోచరమే గదా అంటే-దానికి మాత్రమేమిటి ప్రమాణం అని ప్రశ్న వస్తుంది.
దీనికి కూడా సమాధానమిచ్చారు శంకరభగవత్పాదులు. వేదాంతమేదీ లేదని కొట్టి వేసిందంటే – అది మానవుడి అనుభవానికి వచ్చినప్పటి మాట. అంతవరకూ వ్యావహారికంగా ఈ ప్రపంచమూ ఉంటుంది. జీవుడూ ఉంటాడు. కాబట్టి నిరపేక్షమైన సత్యాన్ని కూడా సరిపోల్చుకుని చూచే అవకాశమెప్పుడూ ఉంది మనకు. అందుకే విచారణ Enquiry చేయమని చెబుతారు భగవత్పాదులు. విచారణ అంటే అలా సరిపోల్చుకొని చూచే ప్రయత్నమే. ఇందులో రెండు భాగాలుంటాయి. ఈ విచారణలో ఒకటి హేతువు. మరొకటి దృష్టాంతం. హేతువనేది అనుమాన ప్రమాణానికి Conception జవాబు చెబితే దృష్టాంతం ప్రత్యక్ష ప్రమాణానికి Perception చెబుతుంది. ప్రత్యక్షానుమానాలంటే అవి ఎక్కడో లేవు. మనదగ్గరే ఉన్నాయి. చక్షురాదులైన మన బాహ్యేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణం. మరి అంతరింద్రియమైన మనస్సే అనుమానం. ఈ రెండే మనకున్న జ్ఞానసాధనాలు. ఈ రెండింటి పరిధిలోకి రాగలిగితే చాలు. మనమిక దేనినైనా విశ్వసిస్తాము. ప్రస్తుత మాగమం పేర్కొనే విషయం మన మనస్సుకు కూడా అతీతమైనది. కనుకనే మనం విశ్వసించలేక పోతున్నాము. దానినే మనం హేతు దృష్టాంతాలతో విచారణ చేశామంటే అది మొదట అనుమాన స్థాయికీ - ఆ తరువాత ప్రత్యక్ష స్థాయికీ దిగివచ్చే అవకాశ మేర్పడుతుంది. దిగి వచ్చిందంటే ఇక మన పూర్వుల అనుభవానికి వచ్చిందని చెప్పే సత్యమే మన అనుభవానికీ వచ్చి తీరుతుంది. సందేహం లేదు.
ఆ మాటకు వస్తే సత్యమనేది ఎప్పుడూ మనం తయారుచేసే పదార్థం కాదు. తయారయితే అసలది సత్యమే కాబోదు. అంతకు ముందునుంచీ ఉన్న సత్యాన్నే మేము దర్శించామని చెబుతున్నారు మహర్షులు. అయితే అది వారి అనుభవమే గాని మన అనుభవం కాదు.
Page 21