పూర్వమొకప్పుడు మన ఋష్యాదులంతా గాఢమైన తపస్సమాధిలో కూచుని అతి నిగూఢమైన సత్యాలను దర్శించగలిగారు. సాక్షాత్తుగా వారు దర్శించిన ఆ సత్యాలే గ్రంథరూపంగా వెలువడితే అది వేదమయింది. ఋగ్యజుస్సా మాధర్వణాలనే గదా మనమిప్పుడు వేదాలని పేర్కొంటున్నాము. ఇవి కేవలమూ వారికి కలిగిన దర్శనమే Vision కాబట్టి పౌరుషేయం కావు. అంటే మానవుడుతన బుద్ధిబలంతో కల్పించినవి కావని భావం. ఇది వారికి నిశ్చితంగా కలిగిన జ్ఞానం కాబట్టి దీనికి నిగమ Conclusion మని కూడా పేరు వచ్చింది. మనదాకా అవిచ్ఛిన్నంగా వస్తూ ఉంది కాబట్టి అదే ఆగమ Tradition మయింది. వచ్చి మనచెవిలో పడింది కాబట్టి శ్రుతి అయింది. అలా పడి మరలా మనకు వినిపిస్తున్నది కాబట్టి చివరకదే శబ్దమయింది.
మొత్తానికిప్పుడు మనకు శబ్దరూపంగా కనిపించే వేద వాఙ్మయమంతా ఒకప్పుడు మన ఋష్యాదులు పరిశోధించి తెలుసుకొన్న సత్యమే. కాబట్టి అది మనకు ప్రామాణికమని వేరుగా చెప్పనక్కరలేదు. లోకజ్ఞానం కన్నా శాస్త్రజ్ఞానం ప్రామాణికమైతే శాస్త్రాలలో కూడా పౌరుషేయమైన మిగతా వాటికన్నా అపౌరుషేయమైన ఈ వేదం ఇంకా ప్రామాణికమని భావించాలి మనం. అంతేకాదు. ఈ వేదంలో కూడా కేవల కర్మకాండను బోధించే పూర్వభాగం కన్నా తత్త్వజ్ఞానాన్ని ప్రసాదించే వేదాంతం లేదా ఉపనిషత్తులనేవి అన్నింటికన్నా పరమ ప్రామాణికమని ఒప్పుకోక తప్పదు. అలాంటి ప్రమాణరాజమైన ఉపనిషత్తులీ ప్రపంచానికి చాటించే పరమార్ధమేమిటి. “సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ” ఈ కనిపించే జగత్తంతా ఈశ్వరుడే. “అయమాత్మా బ్రహ్మ” ఈ జీవుడు కూడా ఈశ్వరుడే. “ఏకమేవా ద్వితీయమ్ బ్రహ్మ” త్రికాలాలలోనూ ఉన్నదొక్క ఈశ్వరుడనే పదార్థమే తప్ప అంతకు భిన్నంగా మరి ఒక తత్త్వమేదీ లేదు. జీవుడు లేడు. జగత్తూ లేదు. రెండూ కేవలం మిథ్యా భూతమే-అని ఇలాంటి పరిపూర్ణమైన అద్వైత భావాన్నే చాటుతున్నాయి. దీనినిబట్టి అద్వైతమే చివరకు సిద్ధాంతమని ప్రతిపాదించటంలో ఎలాటి ఆక్షేపణకు గానీ ఇక చోటు లేదంటారు శంకర భగవత్పాదులు.
అయితే ఇక్కడ మన మెదుర్కోవలసిన సమస్య ఇక ఒక్కటే. అది ఏమంటే శాస్త్రమనేది ఎంత ప్రామాణికమైనా అది లోకంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోలేదు.
Page 20