#


Back

   అంచేత మనకు కలిగే అనుభవాన్ని బట్టి కాదు సత్యాసత్యాలను మనం నిర్ధారణ చేయవలసింది. మనకు కలిగే అనుభవమంతా మన ఇంద్రియాలమూలాన్నే గదా. చక్షురాదులైన ఈ యింద్రియాలు సరిగా పని చేస్తాయని ఏమిటి నమ్మకం చేస్తే చేస్తాయి. లేకుంటే లేదు. చేసినపుడు కూడా సమగ్రమయిన స్వరూపాన్ని చూపజాలవవి. కాబట్టి ఈ ఇంద్రియాల అనుభవాన్ని బట్టి పోతే ఏదీ నిర్ణయించలేము. అయితే మరి దేనినిబట్టి నిర్ణయించాలంటారు. ఆయావస్తువుల స్వభవాన్ని బట్టి మాత్రమే నన్నారు పెద్దలు.

   వస్తు స్వభావాన్ని బట్టి నిరూపించటమే శాస్త్రం Science చేసే పని. శాస్త్రజ్ఞుల అనుభవమే ఒక అక్షర రూపాన్ని ధరించి కనిపిస్తే అది శాస్త్రమయింది. శాస్త్రజ్ఞుడైన వాడేది చెప్పినా అది ఒక ఉబుసుపోకకు చెప్పడు. లేక ఊహాగానాలు చేయడు. ఆయా వస్తువుల లక్షణాలను సాక్షాత్తుగా పరిశోధించి తదనుగుణంగా ఒక సిద్ధాంతం చేస్తాడు. వస్తు గుణానుసారి అయిన సిద్ధాంతం కాబట్టి అది తప్పకుండా మనకు ప్రామాణిక Authority మవుతుంది. మరి ఇలాంటి పరిశీలనా బుద్ధి సాధారణంగా లోకులకుండదు. వారు తమకేది అనుభవానికి వస్తే అదంతా వస్తు స్వరూపమే నని భ్రాంతి పడతారు. బాగా లోతుకు దిగి వివేచన చేయబోరు. అంచేత అది శాస్త్రం మాదిరి మనకు ప్రామాణికం కానేరదు. కానేరదు గనుకనే లౌకిక జ్ఞానమది ఎలాంటిదైనా - శాస్త్రజ్ఞానం దగ్గర తల ఒగ్గవలసి వస్తుంది. ఇలాంటి శాస్త్రాలొకటి గాదు, రెండు గావు. మానవుడు పుట్టినప్పటి నుంచీ ఇప్పటిదాకా అసంఖ్యాకంగా ప్రచారంలో ఉన్నాయి. వైద్య జ్యోతిష భౌతిక రసాయనాదులైన శాస్త్రాలన్నీ ఇలాంటివే. ఇవన్నీ ఆయా రంగాలలో సామాన్యమైన లోకజ్ఞానం కన్నా ఎన్నో రెట్లు సమీచీనమైన జ్ఞానాన్ని మనకందజేస్తున్నాయి.

   పోతే ప్రస్తుత మీ అద్వైత విజ్ఞానాన్ని మనకు ప్రసాదించేది కూడా ఇలాంటి ఒక విశిష్టమైన శాస్త్రమే. మిగతా శాస్త్రాలలాగా ఇది కూడా ఆయా శాస్త్రకారుల పరిశోధనా ఫలితమే. మరి దీనికి శాస్త్రకారులెవరని అడగవచ్చు. వసిష్ఠవామ దేవాదులైన మన ప్రాచీన మహర్షులే దీనికి శాస్త్రకారులు. వారందరూ మనలాటి సామాన్యజనుల పాలిటి కాప్తులు. ఆప్తి అంటే తత్త్వసాక్షాత్కారమని Revelation of truth నిర్వచనం. అలాంటి సాక్షాత్కారం పొందిన వారెవరో వారి కాప్తులని పేరు.

Page 19