పోతే ఇక మూడవవారున్నారు. వారీ మూడింటిలో ఈశ్వరుడనేది ఒక్కటే అసలు సత్యం. దానికి భిన్నంగా జీవజగత్తులు రెండూ సత్యమేకావు. అవి కేవలం మిథ్యా భూతమని పేర్కొంటారు. వీరే అద్వైతులు.
ఇందులో ద్వైతమనేది సమస్యను సమస్యగానే చూపుతుంది లోకానికి, విశిష్టా ద్వైతం సమస్యను కొంత పరిష్కరించటానికి ప్రయత్నిస్తుంది. అద్వైతమలా కాక సమస్యను పూర్తిగా పరిష్కరించి చూపుతుంది. అద్వైతమంటే అసలుద్వితీయమైన పదార్థమే లేనిదని గదా అర్థం. ద్వితీయమే లేకపోతే ఇక ఏ ప్రశ్నకుగానీ ఆస్కారమెక్కడిది. అంచేత సమస్యలన్నీ అక్కడికి పరిష్కారం కావలసిందే, సమస్యను పరిష్కరించిందే సిద్ధాంతం. కనుకనే మొదటి రెండింటినీ పూర్వపక్షం చేసి కడపటిదైన అద్వైతానికే పట్టాభిషేకం చేశారు శంకర భగవత్పాదులు. అంటే ఏమని అర్థం. వారి దృష్టిలో జీవుడు లేడు. జగత్తులేదు. అవి రెండూ మిథ్యా భూతమే. పోతే ఒక సత్యమైన పదార్థమొక్క ఈశ్వరుడేనని సిద్ధాంతం.
అయితే ఇది ఎంత సిద్ధాంతమని చెబుతున్నా వినటానికి మనకు చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఎంచేతనంటే ఇది మన అనుభవానికే విరుద్ధమయిన మాట. ఆబాల గోపాలమూ లోకంలో ఎవరి అనుభవంలో చూచినా జీవజగత్తులనేవి సత్యంగానే భాసిస్తున్నాయి గాని అసత్యమని తోచటంలేదు. అసత్యమయితే అసలనుభవానికే వచ్చేవికావు. నిత్యమూ అనుభవానికి వస్తున్నప్పుడవి అసత్యమెలా అవుతాయి. ఆ మాటకువస్తే ఇంకా ఈశ్వరుడనేదే అసత్యమని చెప్పవలసి వస్తుంది. ఎంచేతనంటేఅది జీవితంలో ఎప్పుడూ మన అనుభవానికి రావటం లేదు. అలాంటప్పుడనుభవ దూరమయిన దాని నున్నదని చాటటమేమిటి. అనుక్షణమూ అనుభవానికి వచ్చే వాటిని లేవని త్రోసిపుచ్చటమేమిటని ప్రశ్న వస్తుంది.
దీనికి శంకరులిచ్చే సమాధానమేమంటే ఒకటి మన అనుభవానికి రావచ్చు, రాకపోవచ్చు. అనుభవానికి వచ్చినంత మాత్రాన అది సత్యమూ కాదు. రానంత మాత్రాన అసత్యమూ కాదు. అనుభవానికి వచ్చిందే సత్యమయ్యేట్టయితే ఆకాశంలో మన కంటికి కనిపించే నల్లని వర్ణం నిజంగానే అక్కడ ఉందని ఒప్పుకోవలసి వస్తుంది. అలాగే అనుభవానికి రానిదంతా అసత్యమయ్యేట్టయితే ఈ అనంత విశ్వంలో మనం చూడని లోకాలెన్నో ఉన్నాయని చెబుతారు శాస్త్రజ్ఞులు. అదంతా అబద్ధమని త్రోసి వేయవలసి వస్తుంది.
Page 18