#


Back

1. సత్యం - మిథ్య

   జగద్గురు మహోపదేశంలో మొట్టమొదట మనం విచారించవలసిన ఘట్టం సత్యమూ-మిథ్యా. అద్వైత సౌధ నిర్మాణానికంతటికీ ఇవి రెండూ రెండు పునాది రాళ్ళవంటివి. సత్యమేదో Reality మిధ్య ఏదో Falsity తెలియకపోతే ఇక ఏది తెలిసినా ప్రయోజనం లేదు. అంతేకాదు. సత్యాన్నే మిథ్యగానూ మిథ్యనే సత్యంగానూ భావించి బోల్తాపడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గట్టిగా విమర్శించి చూడవలసిన విషయమిది.

   సృష్టినంతా గాలించి చూస్తే మనకు కనిపించే పదార్థాలు Categories మూడే. ఒకటి మనలాంటి జీవుడు. రెండు మన ఎదుట కనిపించే జగత్తు. మూడు ఈ రెంటికీ మూలభూతమని భావించే ఈశ్వరుడు. ఇంతకుమించి మరి ఒక పదార్థమేదీ కానరాదు సృష్టిలో. ఇందులో జీవుడనేవాడు మధ్యవర్తి. వాడికొక అగ్రం జగత్తయితే మరొక అగ్రం ఈశ్వరుడు. ఈ రెండింటిలో జగత్తనేది కేవలమొక మూర్తమైన Actual పదార్ధం. ఈశ్వరుడనేది ఒక అమూర్తమైన Ideal భావం. పోతే జీవుడనే వాడిటు జగత్తులాగా మూర్తమూకాదు. అటు ఈశ్వరుడిలాగా అమూర్తమూ కాదు. ఒకవిధంగా చెబితే మూర్తామూర్తమైన తత్త్వమది.

   జీవ జగదీశ్వరులనే ఈ మూడు తత్త్వాలను గురించే లోకంలో ఏ మానవుడు గానీ ఆలోచించవలసింది. ఇంతకుమించి మన ఆలోచనకు తగిలే విషయంకూడా వేరొకటి ఏదీ కానరాదు. సృష్ట్యాదినుంచీ ప్రతి ఒక్క ఆలోచనాపరుడూ సాక్షాత్తుగానో పరంపరగానో ఈ మూడింటిని గూర్చే ఆలోచన సాగిస్తూ వచ్చాడు. అందులో కొందరీ మూడూ-దేనిపాటికది- స్వతంత్రమైన సత్యాలని చాటారు. వారు ద్వైతులు. మరికొందరు మూడూ సత్యాలే అయినా ఈశ్వరుడు మాత్రమే స్వతంత్రమైన సత్యం మిగతా రెండూ దాని విశేషాలని Attributes భావించారు. వీరు విశిష్టాద్వైతులు.

Page 17