#


Back

   అయితే వట్టి ఉబలాటం మాత్రమే అయితే ప్రయోజనం లేదు. దానికి దగిన అధికార సంపత్తి Equipment కూడా పోగు చేసుకోవాలి. అలాగైతే గాని అది కార్యరూపాన్ని ధరించబోదు. అందుకోసమని ఆచార్యులవారి భాష్యార్ణవంలో నేను బహుకాలం నుంచీ మజ్జ నోన్మజ్జనం కావిస్తూ వచ్చాను. ఇంకా కాలహరణం చేశానంటే కాలమే నన్ను హరించవచ్చు ననే భయమొకటి ఇటీవలన ఏర్పడింది. అది మనకు మొదటికే మోనం. అంచేత తగినంత సామర్థ్యమబ్బిందని ఇంకా నమ్మకం లేకపోయినా పరమాత్మ మీద భారం వేసి ఇప్పటికీ తీరులో దీన్ని బయట పెడుతున్నాను. భగవత్పాద భాష్యార్థ మీమాంసా ఫలమిది. సరళమైన తెలుగు భాష అనే పళ్ళెరంలో పెట్టి దీనిని మీకు సమర్పిస్తున్నాను. ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు. అంతా శ్రీవారి కటాక్షమే. మహా అయితే వారు సూచనా మాత్ర సారంగా చెప్పిన కొన్ని భావాలను నేను ఆధునికుల బుద్ధుల కనుగుణంగా అక్కడక్కడ వివరించి ఉండవచ్చు. అదీ వారి కటాక్షమే. ఆ కటాక్ష బలమే నాకు వారి సిద్ధాంతంలో ఇమిడి ఉన్న అన్ని రహస్యాలనూ సాక్షాత్కరింప జేసింది.

   అది కూడా నామనోనేత్రానికారే ఆరు భూమికలలో సాక్షాత్కరిస్తూ వచ్చింది. వాటినే నేను ఆరధ్యాయాలలో పొందుపరిచి మీ ముందు పెడుతున్నాను. ఈ అధ్యాయాలకు నేను చేసిన నామకరణం కూడా నా స్వకపోల కల్పన కాదు. భాష్యకారులక్కడక్కడ తమ భాష్యంలో వ్యవహరిస్తూ వచ్చిన మాటలే. వాటిలో మొదటిది సత్యం- మిథ్య. రెండవది వ్యావహారికం-పారమార్థికం. మూడు పురుష తంత్రం-వస్తుతంత్రం. నాలుగు అధ్యారోపం-అపవాదం. అయిదు కర్మ-జ్ఞానం. పోతే ఆరు జీవన్ముక్తి- విదేహ ముక్తి. మొత్తానికీ ఆరింటిలో అద్వైత విద్య ప్రమేయమంతా కలిసి వస్తుందని నా విశ్వాసం. ఒక విధంగా చెబితే శాంకరమైన షట్సూత్రి ఇది. జిజ్ఞాసువులైన పెద్దలు-పిన్నలు దీనిని సొంతంగా శాంతంగా ప్రత్యక్షరమూ పరిశీలిస్తే పూర్వోక్తమైన అపోహలు తొలగటమే గాదు. జగద్గురు మహోపదేశమనే అమృత రసాన్ని చూఱగొని అమృతత్త్వాన్నే Immortality అందుకోగలరు. తన్మూలంగా వారి జీవితమూ నా జీవితమూ కూడా చరితార్థం కాగలదని సవినయంగా మనవి చేస్తున్నాను.

ఇట్లు

గ్రంథకర్త

Page 16