#


Back

   అంచేత వేదాంత శాస్త్ర ప్రమేయ (Scope of the subject) మంతా మనకొక్క చోట లభించదు. ఒక్క వరసలో కూడా లభ్యం కాదు. మణులూ, మాణిక్యాలలాగా అమూల్యమయిన ఆయన భావాలన్ని అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటన్నిటినీ మరలా ఒక వరుసలో పెట్టుకొని చూస్తే గాని అసలైన శాస్త్రార్థ Subject matter మేమిటో మన కవగతం కాదు.

   ఇలాంటి ప్రతిబంధకాలున్నంత వరకూ హిరణ్యనిధి లాగా పదార్ధమక్కడే ఉన్నా అది మన అనుభవానికి రాదు. రాకనే చాలామంది జిజ్ఞాసువులు సరియైన మార్గమేదో తెలియక బాధ పడుతున్నారు. కొందరిదే మార్గమని చెప్పి దిక్కు తెలియక అపమార్గం పట్టిపోతున్నారు. మరికొందరికి మనకంతు పట్టే విషయం కాదు. ఒకవేళ కొంత తెలిసినా దానివలన సద్యః ఫలమేముందని ఉదాసీనత చూపుతున్నారు. ఇంకా కొందరు ప్రబుద్ధులయితే ఇది అనుభవానికి విరుద్ధం- కేవల ముబుసుపోకకు చేసే ప్రసంగమని కూడా సిద్ధాంతీకరిస్తున్నారు.

   ఇన్ని అపోహలకూ కారణమొక్కటే. అది శాంకరమైన అద్వైత దర్శనం మనకందవలసిన రీతిలో అందకపోవటమే. శాస్త్ర సిద్ధాంత Theory మెంతగా ప్రతిపాదించారో భగవత్పాదులు. దాని అనుభవ మార్గం Practice కూడా అంతగానే నిరూపించారు. ఏ ఒక్కటీ కప్పిపుచ్చలేదు. అన్ని రహస్యాలూ ఆయిన రచనల్లోనే మనకు దర్శనమిస్తాయి. అయితే వాటి నొకటి కూడా తప్పి పోకుండా ఉన్నదున్నట్టు బయటపెట్టే నాథుడు లేడు. అటు ప్రాచీనులలో లేరు. ఇటు నవీనులలోనూ లేరు. ప్రాచీన పండితులున్నారంటే సాంప్రదాయికంగా చదువుకొన్నారే గాని అన్ని విషయాలనూ సమన్వయించే జ్ఞానం లేదు వారికి. ముక్కకు ముక్క విరిచి అర్థం చెప్పమంటే బ్రహ్మాండంగా చెబుతారు. అనవసరమైన తర్క వ్యాకరణ ప్రసంగాలతో కాలక్షేపం చేసి అవసరమైన చోట మౌనం వహిస్తారు. అది ఒక ఛాందనం. పోతే ఇక నవీనుల కిలాంటి ఛాందసం లేదు గాని వారిదొక ఆకాశ తాండవం. అసలు విషయానికి కట్టుబడక దాన్ని విడిచిపెట్టి అవీ ఇవీ ఏ కరువు పెడుతూ ఏదో విను వీధుల్లో ప్రయాణం చేస్తారు. శాస్త్రకారుడి ఉద్దేశమొకటైతే తామొకటి ఊహించి అందులో జొనపటానికి ప్రయత్నిస్తారు. కనుక ఇదీఒక హడావుడే. మొత్తం మీద రెండూ రెండు గానే అయి కూచున్నాయి. దీనితో పైన పేర్కొన్న అపోహలు లోకంలో తొలగిపోవటమలా ఉంచి అలాగే నిలిచిపోయే ప్రమాద మేర్పడింది.

   ఇలాంటి ప్రమాదాన్ని నేను చాలాకాలం నుంచీ గమనిస్తూనే ఉన్నాను. దీని నెలాగైనా తొలగించి మొదట మన తెలుగువారికైనా ఉపకారం చేయాలని నాకు మనసులో ఒక ఉబలాట మేర్పడింది.

Page 15