#


Back

  అవిద్యలు Nescience పొమ్మన్నారు మన ప్రాచీనులు. అవిద్యా క్షేత్రంలో ఎంత కృషి చేసి ఏమి ప్రయోజనం. ఊషర క్షేత్రంలో సల్పిన కృషి లాగా అది నిష్పలమే. మరి ఫలితమే కావాలంటే నిరపేక్షమైన Absolute బ్రహ్మ విద్యనే పట్టుకోవాలి మానవుడు.

   అది జగద్గురువులు బోధించిన ఈ అద్వైత విజ్ఞానం తప్ప మరొకటి నభూతమ్ నభవిష్యతి. సకల సంశయోచ్ఛేదకమైన ఆత్మ విజ్ఞాన Subjective మది. కాబట్టి దాని ముందు మిగతా అనాత్మ విద్య Objective లన్నీ బలాదూరయి పోవలసిందే. అంచేత జిజ్ఞాసా శీలుడైన మానవుడెప్పటికైనా సరే, సంగీతమనీ, సాహిత్యమనీ ఇలాంటి కళలతోనూ, వైద్యమనీ, జ్యోతిషమనీ ఇలాంటి శాస్త్రాలతోనూ తన విలువైన కాలాన్ని వెళ్ళబుచ్చటం శ్రేయోదాయకం కాదు. కేవలం ప్రేయోదాయకమే అవి. ప్రేయస్సు వేరు. శ్రేయస్సు వేరు. తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేది ప్రేయస్సు. సార్వకాలికమైన నిర్వృతిని ప్రసాదించేది శ్రేయస్సు. అలాంటిది మానవులకీ శాంకరమైన విజ్ఞానమొక్కటే. ఎంతటి మేధావంతుడికైనా కళా తపస్వికైనా జీవితంలో చిట్టచివరకది తప్ప వేరు శరణం లేదు. కాదనుకొంటే ఈ జీవితమొక శుష్కమైన అరణ్యమే.

   ఇలాంటి అమూల్యమైన విజ్ఞానాన్ని జగద్గురువులు మనకందించి పోయినందుకు మనం దానినందుకొని అనుభవించగలగాలి. దాని కోసం భగవత్పాదుల రచనలన్నీ ఆమూల చూడంగా పరిశీలించి చూడటం తప్ప మరి ఒక మార్గం లేదు. వారి కావించిన రచనలు కూడా ఒకటిగాదు. రెండు గావు. పరశ్శతంగా ఉన్నాయి. అయితే వాటిన్నటిలోనూ మకుటాయ మానంగా కనిపించేవి వారి భాష్యగ్రంథాలు మాత్రమే. అవి మూడూ మూడు మహా సముద్రాలనే చెప్పవచ్చు. అద్వైత వేదాంత రత్నాలన్నీ అందులోనే నిక్షిప్తమయి ఉన్నాయి. ఒక రత్నాకరాన్ని మథించినట్టే వాటిని మథించి మన మా రత్నాలనన్నిటినీ వెలికి తీయవలసి ఉంటుంది.

   కాని ఇదికూడా అంత సుకరమైన పనిగాదు. భగవత్పాదుల శైలి ఎంత సరళ Simple మైనదో అంత శాస్త్రీయ Scientific మైనది. ఎంత ప్రసన్నమైనదో Clear అంత గంభీర Deep or Profound. మైనది. ఎంత సంక్షిప్త Precise మైనదో అంత సాంగోపాంగ Comprehensive మైనది. ఎంత సంక్షిప్త ఒక్క మాటలో చెబితే అన్యూనా తిరిక్తమైనదా రచన. ఒక్క మాట వేయటానికి లేదు. తీయటానికి లేదు. ఎంత భావమో అంత భాష. ఎంత భాషో అంత భావం. అలాంటి చిక్కణమైన రచన నవగాహన చేసుకోవటమే కష్టసాధ్యం. దీనికి తోడు అవి స్వతంత్రమైన గ్రంథాలు కావు. ఆయా మూల గ్రంథాలకు స్వామివారు చేసిన వ్యాఖ్యానాలు.

Page 14