#


Back

   ఆ పరిస్థితిలో ఆయన ఇక వర్ణాశ్రమాదులు గాని, మిగతా కర్మకాండగాని, అసలు వేదప్రామాణ్యమే గాని, ఏ ఒకటీ ఒప్పుకోరు. అంతా త్రోసిపారేస్తారు. ఇలాంటి ధైర్యంగాని, సాహసంగాని ఏ మతాచార్యుడికీ కానరాదు. అంతా ఒప్పుకొంటూనే ఏదీ కాదనటం ఆయనకొక్కరికే చెల్లింది. అజ్ఞానంలో అన్నీ ఉన్నాయి. జ్ఞానంలో ఏదీలేదు. దీనితో ఇటు అజ్ఞానులనూ, అటు జ్ఞానులనూ, ఇద్దరినీ కాదనకుండా సమస్య పరిష్కరించ గలిగారాయన. ఇంతకన్నా సార్వజనీత Public spirit or altruism ఏముంది. దీనితో హైందవ మతానికే, అందులోనూ బ్రాహ్మణ ప్రాశస్త్యానికే ఆయన దత్తమయ్యారనేమాట కూడా పొరబాటేనని తేటపడుతున్నది. అపేత బ్రహ్మక్షత్రాది భేదమని వర్ణిస్తారు బ్రహ్మతత్త్వాన్ని ఆయన. మరి బ్రాహ్మణుడెవడంటే బ్రహ్మజ్ఞానమున్నవాడే. ఆ శబ్దానికి ముఖ్యార్ధ Primary sense మదే. మిగతా జాతి బ్రహ్మణత్వం కేవల గౌణార్థం Secondary sense లోనే అని లోకానికి చాటిన అతి విశాల హృదయ మాయనది. పైగా కర్మానుష్ఠానమనేది తూచా తప్పకుండా పాటించనక్కరలేదు. అది లేకున్నా తీవ్రమైన జిజ్ఞాస ఒకటి ఉంటే చాలు. బ్రహ్మజ్ఞానానికెవడైనా అర్హుడనే చాటారు. అది కూడా ఏ దేవతలకో మహర్షులకో హక్కు భక్తమనుకోనక్కరలేదు. జిజ్ఞాసువైన ప్రతి ఒక్కడికీ అది సొమ్మేనన్నారు. చీమ మొదలు బ్రహ్మదాకా అందరమూ బ్రహ్మవంశ్యులమేనని ఆయన చాటినమాట. పోతే శాస్త్ర చోదితమైన నిత్యనైమిత్తికాలూ, యజ్ఞయాగాలూ, జపతపోవ్రత పూజా పురస్కారాదులూ, వీటివల్ల కలిగే స్వర్గాదిఫలాలూ, జన్మాంతారాలూ, పుణ్యపాపాలూ ఇవన్నీ ముముక్షువైన వాడికి స్వప్న మాయా మరీచ్యుదక గంధర్వనగ రోపమమనీ, జ్ఞానదృష్టితో చూస్తే అంతా హుళక్కేననీ, ముక్త కంఠంతో చాటి ఈనాటి హేతువాదులకన్నా సంఘ సంస్కర్తలకన్నా ప్రగతిశీల Progressive మైన దృక్పథాన్ని ప్రదర్శించారు. ప్రాచీనతలోనే ఇంత నవీనత చూపిన ఆచార్యుడు గాని, ప్రవక్తగాని ఎవడున్నాడు ? ఇప్పటికి లేడు. ఇక ఉండబోడు. పరిపూర్ణాద్వైతి గనుకనే చెల్లిందది.

   ఏవం గుణ విశిష్ట సర్వాతిగ దృష్టి ఉన్నవాడు గనుకనే ఆయన భగవత్పాదులయ్యారు. అది మరలా ప్రతి ఒక్క మానవుడికీ ఉపదేశించి లోకోద్ధరణకు బద్ధకంకణుడు కావటంవల్ల జగద్గురువులయ్యారు. పరిపూర్ణమైన అద్వైత భావంతో సర్వభావాలూ సమన్వయం చేసి చూపిన ఆ మహాత్ముడు జగద్గురువు కావటంలో ఆశ్చర్యమేముంది.

Page 217