అంచేత మానవ జీవిత పరమార్థమేమిటో తెలుసుకొని తరించాలంటే ఎప్పటికైనా ఏ దేశంలో పుట్టిన ఏ మానవుడైనా సరే, శంకర భగవత్పాదుల ఈ ఉపదేశ సుధాసారాన్ని తనివితీర గ్రోలవలసిందే. ఆ అమృతసారాన్నే నేనారు పాయలుగా ప్రవహింపజేసి పరమార్ధ జ్ఞాన రస పిపాసువులైన మీకందరికీ కర్ణపేయం చేయగలిగాను. దీని నాస్వాదించి మీరందరూ మరలా మీకు స్వాభావికమైన అమృతత్వాన్నే అందుకోగలిగితే అంతకన్నా కావలసింది లేదు. “ఆచార్యవాన్ పురుషోవేద" అన్నట్టు భగవత్పాదుల ఆచార్యకంలో మనకన్నీ సంపన్నం కాకతప్పదు. మరి తన ఎనిమిదవ ఏటనే సకల శాస్త్ర పారంగతుడయి సన్న్యసించి పన్నెండవ ఏటనే సద్గురూపదేశాన్ని సాధించి పదహారవ ఏట భాష్య రచనాదులు కావించి ఇరువదవ ఏట ఆసేతు శీతాచలమూ జైత్రయాత్ర చేసి దేశం నలువైపులా విజయస్తంభాల లాంటి నాలుగు విజ్ఞాన పీఠాలు నెలకొల్పి మహారాజుల మన్ననలు పొంది దిగ్దంతుల లాంటి శిష్య ప్రకాండులను తీర్చిదిద్ది ఎన్నో చర్చలుచేసి మహిమలు చూపి ముప్పది రెండవ ఏటనే సమస్తమూ ముగించుకొని బ్రహ్మభూయాన్ని బడసిన ఆ మహనీయుని కంటే మనకిక ఆచార్య పురుషుడెవరు. నిజాని కాయన కాయనే సాటి.
శంకర శృంకర స్సాక్షా - ద్వ్యాసో నారాయణో హరిః
ప్రతిశ్రుతమ్
జగద్గురూణా ముపదేశ వార్నిధిమ్
ప్రవిశ్య తత్పార ముపైతు మిచ్చతా
మియమ్ కృతిర్నౌరివ మార్గగామినీ
క్రమేణ కుర్యాత్స ఫలమ్ మనోరథమ్
Page 218