#


Back

   కనుకనే వేదాంత మార్గంలో కామ్య కర్మలెప్పుడూ పనికి రావంటారు భగవత్పాదులు. “తపసా అనాశకేన” అనే చోట అనాశకమనే మాట కర్ణం చెబుతూ “కామానశనమనతు భోజన నివృత్తిః” అని వ్యాఖ్యానించారు. అయితే చిత్రమేమంటే కామవాసన లేనివాడే లేడు ప్రపంచంలో. ఈ పని చేసి ఏదో ఫలితం పొందాలనే ఉంటుంది ప్రతివాడికీ. దాన్ని అనుసరించే శాస్త్రం వాడి కాయా కామ్యకర్మలు నిర్దేశించింది. ఒకవేళ శాస్త్రం చెప్పకపోయినా చేసే స్వభావమున్నవాడు చేయనే చేస్తాడంటారు భగవత్పాదులు. శాస్త్రమనేది ఒక దీపంలాంటిదని గదా ఆయన చెప్పిన మాట. దీపానికెదురుగా ఏపనైనా జరగవచ్చు. ఏది జరిగినా పుణ్యం పాపమాజరిపే మానవుడిదే. దీపానికేదీ లేదు. అది కేవలం సాక్షి మాత్రంగా వెలుగు నివ్వటం వరకే. అలాగే శాస్త్రం కూడా మనం ఫలానా కోరిక నాకు కావాలని అడిగితే ఆ కోరికకు తగిన మార్గం సూచిస్తుంది. ఏ కోరికా లేకపోతే ఎలాగైనా ఈ పనిచేసి దాన్ని పొందమని బలవంతం చేసి చెప్పదు.

   దీనిని బట్టి తేలిన సారాంశమేమంటే శాస్త్రం వర్ణించి చెప్పే వర్ణాశ్రమ ధర్మాలుగానీ, కామ్యరూపమైన యజ్ఞాదులుగానీ, లోకుల దృష్టి ననుసరించి చెప్పినవే. మరి ఈ లోకుల మనస్తత్త్వంలో ఉండే వైవిధ్యం Variety చూతామంటే ఇంతా అంతా గాదు. సృష్ట్యాది నుంచీ అది అంతమయ్యేదాకా ఈ వైచిత్రి ఉండనే ఉంటుంది. అంతా కలిపి ఏకం చేయటమనేది నీవల్లా నావల్లా అయ్యే పనిగాదు. ఒక భేదాన్ని తొలగిస్తే మరి ఒకటి తల ఎత్తుతుంది. మొత్తానికి చిల్లిగాదు తూటన్నట్టు ఇది గాకపోతే ఇంకొకటైనా ఉండవలసిందే. అంతా తొలగించటం సాధ్యమయ్యేట్టయితే, మన పూర్వులే దాన్ని ఎప్పుడో సాధించి ఉండేవారు. ఎంత ప్రయత్నించి కూడా వారు సాధించలేక పోయారంటే అది ఇక అసాధ్యమని వేరుగా చెప్పబని లేదు.

   అంచేత శంకరులు చేసింది ఏమీలేదు. ఆయన క్రొత్తగా తెచ్చిపెట్టింది ఏదీలేదు. లోకంలో ఉన్న వ్యవస్థనే శాస్త్రం చెబుతుంటే ఆ శాస్త్రాన్నే ఆయన బలపరిచారు. అన్నిటికీ మూలమీ లోకమే గదా. అయితే ఈ లోకం కూడా అసలు సత్యం కాదు. ఇది కేవలం వ్యావహారికమే Temporary. మన అజ్ఞానం వల్ల కనిపిస్తున్నదే గాని జ్ఞానోదయమైతే ఏదీలేదు. అంతా ఒకే ఒక సత్యమని చెప్పి ఇంకా గొప్ప పరిష్కార మార్గం చూపాడా మహానుభావుడు.

Page 216