#


Back

   అలా తెచ్చిన తరువాత ఇక ఎంత శాస్త్రమైనా దానికి స్థానం లేదు. దాని ప్రయోజన మక్కడికి సమసిపోతుందంటారాయన. “అత్రవేదా అవేదాః" వేదం కూడా ఆ దశలో ఇక అవేదమే. ఇలా వేదానికి ప్రాధాన్యమిస్తూనే దాని పరిధి ఎంత వరకో నిర్ణయించారు. భగవత్పాదులు. ఇక ఆయన వైదిక మతాభిమాని అయి చేసిందేమిటి. అంధమైన అభిమానమైతే తప్పుగాని సహేతుకమైతే అది తప్పెలా అవుతుంది. మీదు మిక్కిలి శాస్త్రీయమైన దృష్టి Scientific Approach అని కొనియాడాలి దాన్ని.

   పోతే వర్ణాశ్రమాదులూ, యజ్ఞయాగాదులూ వీటిని గురించిన ఆక్షేపణ ఇది కూడా ఆయన మనస్తత్వాన్ని బాగా అర్ధం చేసుకోక చేసే తొందరపాటు ఆక్షేపణేనని తోస్తుంది. వ్యావహారికమనీ, పారమార్ధికమనీ సత్యాన్ని ఆయన రెండు శాఖలుగా విభజించి ఉన్నాడనే సంగతి మనం మరచి పోతున్నాము. సత్యమనేది ఏకమే అయినా అది లోకుల దృష్టి భేదాన్ని బట్టి అనేక విధాలుగా భాసిస్తున్నది. ఈ ఆభాస నాధారం చేసుకొనిఏర్పడ్డదే వేదంలో చెప్పిన కర్మకాండ అంతా. వర్ణాశ్రమాలుగానీ, యజ్ఞయాగాదులుగానీ, ఇప్పుడీ కర్మకాండ క్రిందికే వస్తాయి. ఇదంతా కేవల మాభాసే. అంటే మానవుడి అజ్ఞానం చేత కల్పితమయినదే. వాస్తవంలో లేదు. అజ్ఞానదశలో ఉన్నవాడికే ఉన్నదిదంతా. అది లేని వాడికి లేనే లేదు. అయితే ఈ అజ్ఞానమున్న జీవులెప్పుడూ ఉంటారు కాబట్టి ఈ వర్ణాశ్రమాలు కూడా ఒక వ్యవస్థగా System ఏర్పడ్డాయి. అవి మానవులు పాటించవలసిన విధులను Duties వారి వారి వయో వస్థా ప్రజ్ఞా సంస్కారపాటవాన్ని బట్టి విభజించి చూపుతాయి. అందుల కనురూపంగా ఆచరిస్తే దానికి ఫలమైన అభ్యుదయాన్ని Prosperity చూఱగొంటాడు మానవుడు. ఇందులో పొరపొచ్చె మేముంది. సంకుచిత భావమేముంది. ఆ మాటకు వస్తే సంకుచిత భావం వర్ణాశ్రమ విభాగంలో గాదు. తన్మూల భూతమయిన మానవుల అజ్ఞానంలో ఉంది. దాన్ని ఒక ప్రక్క దగ్గర ఉంచుకొనే దీన్ని ప్రక్కకు త్రోసివేయాలంటే ఎలా పోతుంది. అది ఉన్నంతదనుకా ఇదీ ఉండవలసిందే తప్పదు మరి.

   అలాగే పశు హింసాత్మకమయిన యజ్ఞాదులు కూడా మన కపరిహార్యమే అయి కూచున్నాయి. వర్ణాశ్రమాలు కేవలం మన అజ్ఞానం వల్లనైతే ఇవి అజ్ఞానం వల్లనే గాక కామం వల్ల కూడా ఆవిర్భవించాయి. మానవుడికి కామ Craving మనేదే లేకపోతే ఏ యజ్ఞమూ అక్కరలేదు. ఏ యాగమూ అక్కరలేదు.

Page 215