#


Back

   అన్నిటికన్నా విలువైనది సత్యం. అంచేత అచ్చమైన అద్వైత సత్యాన్ని ప్రకటించి శాయశక్తులా ఈ మానవ సమాజాన్ని ఉద్దరించటానికే ఆయన చేసిన ఖండన మండనలన్నీ అంతేకాదు. అవైదికమైన నాస్తిక పాషండాది మతాలన్నింటినీ దేశంలో నుంచి పారదోలటమూ, దేశం నలుమూలలా తిరిగి దిగ్విజయం చేసి నాలుగు విజ్ఞాన పీఠాలు నెలకొల్పటమూ తద్ద్వారా జ్ఞాన ప్రచారం చేయటమూ కూడా ఇందుకోసమే. ఇలాంటి విశ్వజనీనమైన వ్యక్తిత్వమున్నవాడు గనుకనే జగద్గురువనే మాట ఆయన ఎడలనే సార్ధకమయింది.

   అయినా “ద్విషంతి మందా శ్చరితమ్ మహాత్మనా” మన్నట్టు ఆయనను దుయ్యబట్టే ప్రబుద్దులుండనే ఉంటారు. ఆయన కేవలం వైదిక మతాభిమాని అని కొందరు. బూజు పట్టిన వర్ణాశ్రమ ధర్మాలను ప్రోత్సహించాడని కొందరు. హింసాత్మకమైన యజ్ఞయాగాదులను కూడా సమర్ధించాడని కొందరు. మరి హైందవమైన సంకుచిత దృష్టి తప్ప అంతకు మించి విశ్వతో ముఖమైన విశాలదృష్టి ఆయనకు లేదని మరి కొందరు. ఇలా ప్రతి ఒక్కటింగణా ఆయనను తప్పు పట్టేవాడే.

   ఇవన్నీ ఒక్క మాటలో చెబితే అవివేక మూలకమైన ప్రసంగాలు. వేదశాస్త్రాల కాయన ప్రాధాన్యమిచ్చాడంటే అందులో ఎంతో అంతరార్ధముంది. వేదమంటే కేవలం తాటాకులూ, గంటమూ, అక్షరాలూ కాదు. "ఉపనిషన్నామ నశబ్దరాశిః" అని ఆయనే సెలవిచ్చారు. అవి దానికి బాహ్యమైన సంకేతాలు మాత్రమే. పోతే వాటి వెనకాల దాగిన మనప్రాచీన మహర్షుల Great Seers అనుభవమే వేదమంటే. అది అతీంద్రియం Supra Mental గనుక పరమార్ధ విచారణలో అది ఒక్కటే సాధనమని ఆయన మనకిచ్చే సలహా. అయితే దాన్ని సాధనం గానే చూడాలి గాని అదే పర్వస్వమని మరలా భావించరాదని హెచ్చరిస్తారాయన. “జ్ఞాపక మేవహి శాస్త్రమ్ నకారకమ్” శాస్త్రమెప్పుడూ మనకొకవిషయం తెలపటానికే గాని లేనిదాన్ని సృష్టించటానికి గాదు. ప్రమాణాంతరానికి విరుద్ధమైన మాట శ్రుతి చెప్పినా ఒప్పుకోబని లేదంటారాయన. సిద్ధమైన పదార్ధాన్ని ఏదిగానీ క్రొత్తగా సృష్టించలేదు. కేవలం దాన్ని వర్ణించవలసిందే. అది కూడా విషయరూపంగా ఉంటేనే. బ్రహ్మమనేది దేనికీ విషయమయ్యేది కాదు. కాబట్టి శాస్త్రంకూడా దాన్ని సాక్షాత్తుగా Direct నిర్దేశించలేదు. భంగ్యంతరంగా Indirect మన దృష్టికి తేవలసిందే.

Page 214