దానినే వారు నిజమైన ఆత్మ అని బోల్తా పడుతున్నారు. కనుక గొర్లకాపరుల కన్నా శోచనీయులైన పండితమ్మన్యులీ కర్మ మీమాంసకులంటారు శంకరులు. పైగా ఇలాంటి పండితమ్మన్యులు మాలో ఉన్నా మేము క్షమించమంటూ "అస్మదీయాశ్చ కేచన" అని ఉత్తర మీమాంసకులను కూడా మందలించారు.
ఇక తార్కికులనైతే ఎన్ని విధాల ఎత్తి పొడిచారో చెప్పలేము. కుతార్కిక భేదదృష్టి - తార్కికకు దృష్టి అని చమత్కారంగా అంటారొకచోట. తార్కికుల దృష్టి శని దృష్టిలాగా వక్రమైన దృష్టి అట. ఉన్నదొకటైతే వారు ఊహించేది మరొకటి. "అపుచ్ఛ విషాణాః తార్కిక బలీ వర్దాః" అంచేత తోకలూ కొమ్ములూ లేని పోతుటెద్దులాగా విశృంఖలంగా విహరిస్తుంటారట వారు. అంతేకాదు. వారి తెలివి తేటలెంత అమోఘమంటే “భేపిశాకునమ్ పద మన్వేష్టుమ్ శక్నువంతి" ఆకాశంలో తిరిగే పక్షుల జాడగూడ తీయగలరు. "ఖమపి ముష్టినా హంతుమ్ ప్రభవంతి” దాన్ని పిడికటి పోట్లతో కుమ్మి పారేయగలరు. "వయంతు తత్కరు మశక్తాః” మరి అంతలేసి పనులు మావంటి అసమర్థులమెలా చేయగలమని ఎత్తి పొడుస్తారు. ఇక బౌద్ధులలో శూన్యవాదుల Nihilists నైతే “సర్వ ప్రమాణ విరుద్దత్వాత్ తన్నిరా కరణే నాదరః క్రియతే” ఏ ప్రమాణానికీ లొంగిరానిదది ఒక వాదమేమిటి పొమ్మని దాన్ని ప్రతిఘటించటానికే ఆదరం చూపరాయన.
ఈ విధంగా చూస్తూ పోతే ఆయన చీవాట్లు పెట్టని మతాచార్యుడే లేడనుకోండి. అయితే ఇంతమంది ఆచార్యుల మత మప్రమాణమయి తనది మాత్రమే ప్రమాణమెలా అయిందని మనకాయన మీద పట్టరాని ఆగ్రహం రావచ్చు. దానికాయన గారే ఇచ్చారు సమాధానం. సత్యం కోసమని గదా మనమంతా అన్వేషిస్తున్నాము. ఆ సత్యమనేది ఎప్పుడూ ఒకే ఒకరూపంలో ఉంటుంది గాని నిమిష నిమిషానికి దాని రూపం మారుతూ పోదు. అలా మారితే అది సత్యమే గాదు. మరి సత్యాన్వేషకులమని చెప్పుకొంటున్నప్పుడు మన కర్తవ్యమేమిటి. ఏకరూపంగా Uniform Consistant నిలిచి ఉన్నదేదో దాన్నే పట్టుకోవాలి మనం. దాన్నే లోకులకు బోధించాలి. మరి ఏకరూప మెప్పుడవుతుంది సత్యం. జీవ జగదభిన్నంగా భావించినప్పుడే అవుతుంది. అలాకాక జీవుడు వేరు జగత్తు వేరని కూచుంటే ఏకరూపం కాదది. అనేక రూపం అనేకమైతే అది వికల్పానికి Diversity దారి తీస్తుందేగాని నిర్వికల్పమైన సత్యం కానేరదు.
Page 211