#


Back

   ఐకాంతిక ఫలత్వ నిర్ధారణేహి సతి తత్సాధనానుష్ఠానాయ సర్వోలోకో2_ నాకులః ప్రవర్తతే, నాన్యథా అతశ్చానిర్ధారి తార్థమ్ శాస్త్రమ్ ప్రణయ న్మత్తోన్మత్తవ దను పాదేయ వచనః స్యాత్" తీర్థం కరుడంటేవాడెంతో జవాబుదారీ వహించాలి. వాడు చెప్పే ప్రతి మాటా లోకులకు ప్రామాణికంగా Authoritative ఉండాలి. ఎప్పుడలా ప్రామాణికమవుతుంది. ప్రమాణ ప్రమేయాదులను చక్కగా నిర్ధారణ చేసి ఒక సిద్ధాంతాన్ని బోధించినప్పుడే. లేకుంటే అది ఒక పిచ్చివాడి ప్రేలాపన అని చెప్పి వాడి మాటలకు విలువ నివ్వరు లోకులు. కాకపోయినా అలాంటి మాటలు విని ఎవరు బాగుపడాలని. ఎంత కఠినమైన మాటలో చూడండి ఇవి.

   ఇలాగే సాంఖ్య సిద్ధాంత ప్రవర్తకుడైన కపిలుణ్ణి కొందరు గొప్ప చేసి చాటిస్తుంటే వారినిలా మందలిస్తారు భగవత్పాదులు. కపిలుణ్ని మీరు సిద్ధపురుషుడుగా Ac-complished soul భావిస్తే భావించవచ్చు. కాని ఆ సిద్ధి అకస్మాత్తుగా రాలేదతనికి. విశిష్ట ధర్మానుష్ఠానం వల్లనే కలుగుతుంది ఏ సిద్ధి అయినా, ఆ ధర్మం శ్రుతి చోదనా మూలకం. అలాంటప్పుడు శ్రుతి విరుద్ధమైన ప్రసంగమెలా చేశాడు కపిలుడు. అతడు శ్రుతులన్నీ బోధించే సర్వాత్మ దర్శనాన్ని సమ్మతించడు గదా. ఆత్మభేదాన్నే సిద్ధాంతీకరించి కూచున్నాడు. అంతేగాదు. ప్రకృతి అనేది పరమేశ్వరా శ్రయ అని శ్రుతులన్నీ ఘోషిస్తుంటే అది సర్వ స్వతంత్ర అని వాదిస్తాడు కపిలుడు. ఇలాంటి కపిలుణ్ణి ఆర్ష విజ్ఞాన సంపన్నుడని చెప్పి ఆయనను పట్టుకొని వ్రేలాడతారు లోకులు. మేమెంత ప్రామాణికంగా వ్రాసినా బోధ చేసినా మా మాట నమ్మరు. ముప్పాతిక మూడుపాళ్ళు పరతంత్ర ప్రజ్ఞులీలోకులు. పేరు ప్రఖ్యాతులను బట్టి పోతారే గాని ప్రామాణికమా కాదా అని పరామర్శించి చూడరు. ఇలా సాంఖ్యాచార్యుడైన కపిలుణ్నే గాక అతణ్ణి పట్టుకు ప్రాకులాడే లోకులను కూడా చీవాట్లు పెట్టారు.

   అలాగే తోటి మీ మాంసకులను కూడా లెక్క చేయలేదాయన. వేద ప్రామాణ్య మంగీకరించక మిగతా వాళ్ళు చెడితే అంగీకరించి కూడా చెడిపోయారు వీరు. అజావి పాలురకంటే హీనమని హేళన చేస్తారు వారినాయన. ఎందుకంటే అంతటి అవివేకులు వారు. తమకు తెలిసిందే ఆత్మ అని సంతోషిస్తున్నారే గాని వారు తెలుసుననుకొంటున్నది అసలైన ఆత్మకాదు. అదినకిలీ ఆత్మ False self. అసలైన ఆత్మ అహంకారానికి గూడా సాక్షి అయి ఉంటుంది. అదికాదు మీమాంసకులు పట్టుకొన్నది. వారు పట్టుకొన్నది కర్తృరూపమైన అహంకారం.

Page 210