ఆయనే చేయకపోతే ఆయన గారి అడుగు జాడలలోనే పయనించే మనం చేయటమిక ఎలా సంభవం. మూల గ్రంథాల మీద విచారణ సాగించి వాటి హృదయాన్ని పట్టుకొని వారెలా బయట పెట్టారో వారి విచార సాగరాన్ని మథించి దాని ఫలితంగా వచ్చిన నవనీతాన్నే నేనూ తమ ముందు పెట్టాను. ఇందులో ఎలాటి అపశ్రుతికి గానీ చోటు లేదు. అంతవరకూ నిస్సంకోచంగా చాటగలను.
అంతేగాదు. దీనిని రచించే నేనూ పఠించి మీరూ ఆయనకేదో ఒక కిరీటం పెడుతున్నామని కూడా భావించనక్కరలేదు. మకుటంలేని మహారాజాయన. ఆ మహనీయుడికి మనం చేసేదేముంది మేలు. ఆయన విజ్ఞానాన్ని అందుకొని ఆస్వాదించటమే మనకు పదివేలు. మరి విజ్ఞానమంటే ఇలాటి అలాటి విజ్ఞానం కూడా కాదది. నిరంతర సత్యాన్వేషణ శీలుడైన మానవుడి సమస్త విజ్ఞానానికీ గీచిన సరిహద్దులాంటి దాయన మనకందించి పోయిన అద్వైత విజ్ఞానం. దీనికి సాక్ష్యం మనమెంతో దూరంపోయి వెదకనక్కరలేదు. ఒక్క సంగతి ఆలోచిస్తే మనకు చక్కగా తెలిసిపోతుంది. అదేమిటంటే ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి దేశాలు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జాతి, ఒక్కొక్క నాగరికతా కనిపిస్తున్నాయి. ఈ నాగరికతా చరిత్ర పరిశీలిస్తే మొదట ఒక అంధమైన విశ్వాసంతో Superstition ఆరంభమవుతుంది జాతి. తరువాత కొంత కాలాని కదిహేతు వాదానికి Reason or Science దారితీస్తుంది. అది కొన్నాళ్ళకు ఇహానికే గాక పరానికి కూడా ఎగబ్రాకి మతంగా Religion చెలామణి అవుతుంది. దాన్ని మరలా హేతు దృష్టాంతాలతో నిరూపణ చేసి చూపితే తత్త్వ విజ్ఞానంగా Philosophy అవతరిస్తుంది. అది మరలా మానవుడి అనుభవానికి వచ్చేసరికి కేవల మద్వైత దర్శనంలోనే పరిసమాప్తి చెందుతున్నది.
ఇలా ప్రతి ఒక్కటీ లోకంలో కేవలద్వైత దృష్టితో ప్రారంభమై చివరకు కేవలా ద్వైత దృష్టితో అంతమవుతున్నదంటే శంకరులు బోధించిన ఈ అద్వైత విజ్ఞానమెంత గొప్ప విజ్ఞానమో చెప్పనక్కరలేదు. ప్రతి ఒక్క మతమూ పరిశీలిస్తే కట్టకడపట మన ఈ అద్వైత దర్శనానికే పట్టం కట్టి కూచున్నది. ప్రపంచమంతా వ్యాప్తిలో ఉన్న పెద్ద పెద్ద మతాలన్నీ గాలించి చూడండి. ఈ రహస్యం బయట పడుతుంది. Mysti-cism అని ఒక భావ మీ రోజులలో చాలా బహుళ ప్రచారంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆది మానవుడి విజ్ఞానానికంతటికీ ఆఖరి మెట్టని లోకంలో ఉన్న మేధావులందరూ అంగీకరించిన సత్యం.
Page 207