#


Back

   భాష్యాక్షరాన్ని గాక అందులో దాగి ఉన్న భాష్యకర్త హృదయాన్ని పట్టుకొని వ్రాసేటప్పుడు కేవల శాస్త్రాభ్యాసులకు కొంత వింతగా భాసించవచ్చు. హత ప్రహతమైన మార్గం తప్పకుండా పోవటం మంచిదే అయినా దానికి కొంత స్వకీయమయిన మననం కూడాఉండాలని వారికి నా సలహా. ఇందులో కూడా ఆచార్యులవారే నాకు మార్గదర్శకులు. ఎంత గురూపదేశమని ఆయన ఘోషిస్తున్నా కేవలం గురుముఖంగా లభించిన విద్యతోనే ఆయన తృప్తి చెందిన వాడు కాదు. దానిమీద ఎంత దీర్ఘంగానో చింతన చేశాడాయన. అలాటి చింతన ఫలమే ఆయన భాష్య రచన. భాష్యంలో కొంతచూపు పెట్టి వెదకితే అంతకు ముందెవ్వరూ చెప్పని ఆశ్చర్యం గొలిపే స్వతంత్ర భావాలు ఎన్నో దొరుకుతాయి మనకు. సంప్రదాయానికి విరుద్ధంగా చెబుతున్నట్టు కూడా భాసిస్తుందొక్కొక్క చోట. ప్రత్యక్షాను మానాలంటే శ్రుతి స్మృతులని అర్ధం చెప్పారాయన. యా నిశా సర్వభూతానామనే చోట నిశా శబ్దానికి పరమాత్మ అని అర్ధం చెప్పారు. మరి ఆత్మ, యోగ, ప్రకృతి ఇలాంటి శబ్దాల కొక్కొక్క చోట ఒక్కొక్క అర్థం చెబుతూ వచ్చారు. "బ్రహ్మనచిరేణాధి గచ్ఛతి” అని ఉంటే బ్రహ్మ శబ్దానికి సన్న్యాసమని కూడా అర్థం చెబుతారు. ఒక శబ్దమనే గాదు. శ్లోకాలకూ సూత్రాలకు కూడా అలాగే వ్యాఖ్య చేస్తారు. "కర్మణ్య కర్మ” “యావా నర్ధ ఉదపానే” ఇలాంటివెన్నో ఉన్నాయి ఉదాహరణకు.

   అయితే ఇవన్నీ విరోధాభాసలేగాని విరోధాలు కావు. శాస్త్రంలో పూర్వాపరాలు బాగా కలియబోసుకొని దాన్ని తన అనుభవంతో చక్కగా మేళవించుకొని చెబుతారాయన ఏది చెప్పినా. కేవలం చిలక చదువుగా చెప్పరు. ఆ స్థాయి కెదిగి పట్టుకొంటేనే అది మన కర్ధమవుతుంది గాని లేకుంటే కాదు. అలా ఎదిగి చూడమనే మనకు గూడా సలహా ఇస్తారాయన. "సుహృద్భూత్వా ఆచార్యః ఆచష్టే" అనేది ఆయన కిష్టమైన వాక్యం. దీనికి సాంప్రదాయికమైన అర్థమిదే అయినా మనం దాన్ని ఇలాగే తీసుకోనక్కరలేదు. యథావకాశంగా పోవచ్చునని మన మేలుకోరి బాదరాయణులు చెబుతున్నారంటారాయన. సత్యాన్ని మరుగుపరచకుండా శాస్త్ర సిద్ధాంతానికి దెబ్బ తగలకుండా చెప్పినంతవరకూ ఎలా చెప్పినా పరవాలేదు. తద్విరుద్ధంగా పోయినప్పుడే ప్రమాదం. “నహి వరఘాతాయ కన్యా ముద్వాహ యంతి" పెండ్లికొడుకు ప్రాణానికి ముప్పుతెచ్చే పెండ్లి పనికి రాదని ఆయనే అంటారు. హాస్యంగా. అలాంటి ముప్పు తెచ్చే వ్యాఖ్యానమెప్పుడూ చేయలేదాయన.

Page 206