#


Back

   ఇంతవరకూ మనం శంకరాద్వైత విజ్ఞానమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చి ఇప్పటికి గమ్యస్థానం చేరుకొన్నాము. ఈ మార్గంలో మొత్తం మీద ఆరు మజిలీలను దర్శించాము మనం. ఆరూ కలిసి ఒకదానికొకటి మనలను నడిపిస్తూ శాస్త్ర ప్రమేయా Scope of the Subject న్నంతటినీ అరచేతిలో ఆమలకంలాగా మనకందజేస్తున్నాయి. అందులో ఈ కనిపించే ప్రపంచమే సత్యమని చూస్తుంటే మనం- ఇది వాస్తవంలో లేదు ఉన్నదొక్క బ్రహ్మమేనని తేల్చివేసింది మొదటి భూమిక. అయితే అది ఒక్కటే ఉండాలి గదా ఈ ప్రపంచం కూడా ఇలా ఎందుకు కనిపిస్తుందనే దానికిది కేవలం వ్యావహారికమే దీనినొక ఆలంబనంగా చేసుకొని మనమెప్పటికైనా ఆ పారమార్ధికాన్ని అందుకోవాలని చెబుతుంది రెండవ భూమిక. అలా చేరటానికి సాధనమేమిటని అడిగితే పురుషతంత్రమైన కర్మా ఉపాసనా గాదు కేవలం వస్తు తంత్రమైన జ్ఞానమేనని చాటుతుంది మూడవది. ఆ జ్ఞానమనేది ఎలా పనిచేస్తుంది దాని బలంతో తత్వాన్ని మనమెలా అనుభవానికి తెచ్చుకోవాలని ప్రశ్న వస్తే అనాత్మ రూపమైన ప్రపంచాన్ని మొదట ఆధ్యారోపం చేసి అంతా అపవదిస్తే చివర కాత్మ రూపంగా అదే భాసిస్తుందని బోధిస్తుంది నాలుగవది. అయితే ఇది అందరికీ ఫలితమివ్వటం లేదే కారణమేమిటని అడిగితే ప్రాక్తన కర్మ ప్రతిబంధమే కారణం అని చెప్పి దాన్ని రూపుమాపటానికి మొదట శమాదులూ పిమ్మట శ్రవణాదులూ అభ్యసించాలని సలహా ఇస్తుందయిదవది. పోతే ఇలాంటి సాధన వల్ల మనకు కలగబోయే ఆమోక్షమనే ఫలాన్ని కర్ణపేయంగా వర్ణిస్తుంది ఆఖరిదైన ఆరవ భూమిక. ఒక్క మాటలో చెబితే జీవిత సత్యమేదో దాన్ని నిర్ధారణ చేసుకొని సాధన చేస్తూ పోతే ఈ సంసార బంధం నుంచి మనం శాశ్వతంగా విముక్తి పొందగలమని సిద్ధాంతం.

   శంకర గ్రంథావళిలో విస్తరించి ఉన్న ఈ అద్వైత సిద్ధాంతాన్నే నేనీ గ్రంథంలో సంగ్రహంగా పొందుపరిచి తమకందజేశాను. కేవలం భాష్యానుసారిగా రచించిన గ్రంథమే అయినప్పటికీ అక్కడక్కడ కొంత స్వాతంత్ర్య మవలంబించవలసి వచ్చింది. అది ఆధునికుల బుద్ధులకు భాష్యార్థాన్ని మలచి చెప్పటానికి చేసిన ప్రయత్నమే గాని మరేదీ గాదు.

Page 205