మొత్తం మీద ఇంతవరకూ సాగిన ఈ దీర్ఘమైన విచారణకంతటికీ ఏమిటి ఫలితాంశమని ప్రశ్న. మానవుడు శాస్త్రోక్తంగా సాధనచేసి చివరకు పొందవలసిన ప్రయోజనం ముక్తి. ముక్తి అంటే విడుదల అని అర్థం. సంసార దుఃఖభారం నుంచి వైదొలగటం కాబట్టి అది ముక్తి అయింది. ఇది జీవన్ముక్తి-విదేహముక్తి అని రెండు విధాలు. జీవన్ముక్తుడికి ప్రారబ్ధమనే కర్మమాత్రముంటుంది. అయినా అది బ్రహ్మ నిష్ఠాబలంతో నిగ్రహించుకోగలడు. కాబట్టి శరీరాదులున్నా అతణ్ణి బాధించలేవు. కేవలమొక నీడలాగా అనుసరించి ఉంటుందది. ఇలాంటి జీవన్ముక్తులు మరలా రెండు జాతులు. ఒకరు ఆత్మారాములు. వారికి లోకంతో పనిలేదు. పోతే లోకంతో పని ఉన్నవారు రెండవ జాతికి చెందిన ఆచార్యపురుషులు. వీరంతా లోకోద్ధరణ కోసమని పరమాత్మచేత నియోగింపబడతారు. వేదవ్యాసాది మహర్షులంతా ఇలాంటివారే. వారు తమ బోధలద్వారా వ్రాతల ద్వారా ముముక్షు జనాన్ని సాధకులుగా తీర్చిదిద్దుతారు. ఇది ఒక చక్కని సంప్రదాయంగా Tradition పరిణమిస్తుంది. దానివలన విద్య విచారాత్మకమే Visionary గాక ప్రచారాత్మకం Missionary కూడా అయి వ్యాప్తి చెందుతుంది. పోతే ఈ జీవన్ముక్తుడు శరీరపాతమైన తరువాత విదేహముక్తుడవుతాడు. ఈ దేహం పోయి మరలా ఇక దేహం రాకపోవటమే విదేహమంటే. అందులో జ్ఞానంతోపాటు సర్వశక్తులూ వశమవుతాయి కాబట్టి నిర్గుణంగానే గాక సగుణంగా కూడా భాసించవచ్చు. తన్మూలంగా సృష్టిస్థితి సంహార తిరోధానానుగ్రహాది క్రియల కన్నింటికీ సమర్ధుడవుతాడు ముక్తుడు. సమస్త క్లేశాలూ అస్తమించి సకల సుఖాలూ అనుభవిస్తూ ఏ కార్యమైనా చేయగలిగి మరలా అదంతా తన స్వరూపంగానే చూడగలిగిన అపరోక్షాద్వైతానుభూతి అది. దానితో పురుషార్ధమనేది అప్రయత్నంగా ఫలిస్తుంది. ఇంతకన్నా మానవ జీవితానికి వాంఛింప దగిన గమ్యం మరొకటి లేదు.
సాకాష్ఠా-సా పరాగతిః
అహ మేవ పరమ్ బ్రహ్మ బ్రహ్మా హమ్ పరమమ్ మతమ్
Page 204