#


Back

   అయితే ఆ దృష్టితో చూడాలి ఎటు వచ్చీ. చూడకుంటే మరలా అపూర్ణమేనని హెచ్చరిస్తారు భగవత్పాదులు. ముక్తుడు ప్రస్తుతమిలాంటి పూర్తైక దృష్టితోనే ఉంటాడు కాబట్టి సహజమైన జ్ఞానశక్తితో సంసారానికంతా అతీతుడయి ఉంటాడు. మరలా తన మాయా శక్తితో జగత్సృష్టి స్థితిలయాల కాధిపత్యమూ వహిస్తుంటాడు. జగద్వ్యాపార వర్ణమనీ సగుణ ముక్తులకు చెప్పిందేగాని విదేహముక్తుడికా కొఱత లేదు. సగుణ ముక్తులు సద్యోముక్తులు కారు. వారు క్రమ ముక్తులు. దేహావసానంలో సత్యలోకానికి పోయి అక్కడ “పరస్యాంతే కృతా త్మానః ప్రవిశంతి పరమ్ పద”మ్మని క్రమంగా శిక్షణ పొందిగాని ముక్తులు కారు.

   పోతే ఈ విదేహముక్తులలా కాదు. వీరు సద్యోముక్తులు. వీరికి బ్రహ్మలోకాది గమనం లేదని చెప్పాము. కాబట్టి నిత్యముక్తుడైన ఈశ్వరుడిలాగా సృష్టిలయాదులు చేయగలరు. అలా చేస్తున్నా ఆ ఈశ్వరుడిలాగానే ఏదీ అంటి ముట్టకండా ఉండగలరు. అన్ని సుఖాలూ అనుభవించగలరు. అలా అనుభవిస్తూ ఏ అనుభవమూ లేని స్వరూపావస్థలో ఉండగలరు. ఒకరేదీ వారికివ్వ నక్కరలేదు. అంతా స్వరూపమయి నప్పుడెవరున్నారు గనుక. తమ ఇచ్చతోనే తామన్నీ సృష్టించుకొని అనుభవిస్తుంటారు. అది తమ స్వరూపమే కాబట్టి తమ అద్వైత భావానికెప్పుడూ ముప్పువాటిల్లదు. "ఏక మేవా ద్వితీయమ్ బ్రహ్మ." స్వస్థత అంటే అసలిదేనన్నారు భగవత్పాదులు. "స్వస్మిం స్తిష్ఠతీతి స్వస్థః తస్యభావః స్వస్థతా” తనలో తానుండటమే స్వస్థత. ఎక్కడ ఉన్నా ఉన్నది తనస్వరూపమే కాబట్టి ముక్తుడెప్పుడూ తనలోతానే ఉంటాడు. అదే అచ్యుతమైన ఆరోగ్యం మనం పాలిటికి. ఇక దానికి మరలా పునరావృత్తి అనే రోగం లేదు. సకల సంసార దుఃఖాలూ నివృత్తి అయి సర్వసుఖాలూ చేకూరినట్టే. దానితో సమస్త పురుషార్ధాలు కూడా సిద్ధించినట్టే. సిద్ధిస్తే ఇక పురుషుడు నిజంగా పురుషుడే. 'పురిశయనా త్పురుషః' మొదట ఈ శరీరమనే పురంలో ప్రవేశించాడు. 'పూరణా త్పురుషః' తరువాత బ్రహ్మవిద్య నార్జించి దాని బలంతో సర్వ ప్రపంచాన్నీ పూరించి నిండిపోయాడు. 'పూర్ణత్వా త్పురుషః' ఆ పిమ్మట అంతా స్వరూపంగానే అనుభవిస్తూ పరిపూర్ణుడయి నిలిచాడు. అందుకే అతడు పూర్ణ పురుషుడు.

Page 203