#


Back

   వాస్తవమే. అన్నీ వాడి స్వరూపానికి భిన్నమనే భావన ఉంటే అది ముక్తికాదు. బంధమే. కాని చిత్రమేమంటే అతడేది సంకల్పించినా దానితో అతడేది దర్శించినా ఆత్మ చైతన్యాని కనతిరిక్తంగానే దర్శిస్తుంటాడు. ప్రతి ఒక్కటీ చైతన్య పరిధిలో చైతన్యాత్మకంగానే అనుభానికి వస్తుంటుంది. ఇది బంధావస్థలో లేదు. ముక్తావస్థలో మాత్రమే కనిపించే విచిత్రం. ఇది వాడికి స్వానుభవైక వేద్యం కాబట్టి సంసార బంధంలో సతమతమవుతున్న మన బోంట్ల కంతుపట్టేది కాదు. పట్టకుండా ప్రశ్నవేస్తే సుఖం లేదు. అనేక వికల్పాలకది దారితీస్తుంది. అలా వికల్పించినవారే పూర్వం బాదరి మొదలైన ఆచార్యులంతా. బాదరి ముక్తావస్థలో శరీరేంద్రియాల ఉనికి నంగీకరించడు. జైమిని శరీరేంద్రియాలు కూడా ఉన్నాయంటాడు. రెండింటికీ అవకాశముందని సమన్వయించారు బాదరాయణులు. ఆయన చెప్పేదేమంటే ముక్తుడైన వాడిక బ్రహ్మమే. బ్రహ్మానికన్ని శక్తులూ ఎలా సహజంగా ఉన్నవో వాడికీ అవి సంక్రమించవలసిందే. తన్మూలంగా ఏదైనా సంకల్పించవచ్చు. ఏదైనా సాధించవచ్చు. ఇందులో సంకల్పించటం Planning జ్ఞానశక్తి అయితే సాధించటం Execution క్రియాశక్తి. లేదా ఐశ్వర్యం. ఈ జ్ఞానైశ్వర్యాలు రెండూ ఎంత మోతాదులలో ఉండాలో అంతమోతాదులలోనూ ఉంటాయి ఆ దశలో. ఇక ముక్తుడికి కొదవ ఏముంది.

   ఇందులో రహస్యమేమంటే ముక్తుడు బ్రహ్మీభూతుడే కాబట్టి బ్రహ్మంలాగా ద్విపాత్రాభినయం చేయగలడు. ఏమిటా ద్విపాత్రలు. నిరుపాధిక Transcendent మొకటి. సోపాధిక Immanent మొకటి. మొదటిది అద్వితీయమైన చైతన్యమైతే రెండవది సద్వితీయమైన విభూతి. మొదటి దానిలో ఏ అనుభవమూ లేదు ముక్తుడికి స్వరూపానుభవం తప్ప. రెండవ దానిలో అలా కాదు. సంకల్ప బలంతో అన్ని భావాలూ సృష్టిస్తాడు. కాబట్టి స్వరూపానుభవమే కాక అన్ని అనుభవాలూ ఉంటాయి. అలా ఉన్నప్పుడే అది పరిపూర్ణత Perfection లేకుంటే పరిపూర్ణ మనిపించుకోదు. పరిపూర్ణం కాకుంటే అది మోక్షమే కాదు. అందుకే “తస్మిన్ దృష్టే పరావరే” అంటుందుపనిషత్తు. పరమంటే కారణ రూపం. అవరమంటే కార్యరూపం. కారణ కార్యరూపాలు రెండూ అదే. “పూర్ణమదః-పూర్ణమిదమ్” అది పూర్ణమైతే దాని సంకల్పం వల్ల సృష్టి అయిన ఇదీ పూర్ణమే.

Page 202