బ్రహ్మజ్ఞానం కలిగితే సర్వమూ నేననే భావమనుభవానికి వస్తుంది. దీనికే సర్వాత్మభావమని పేరు. సర్వానికీ వాడాత్మ. సర్వమూ వాడికాత్మ. రెండు విధాలుగా నిర్వచించారు దీన్ని భగవత్పాదులు. ఇందులో సర్వమూ కనిపిస్తూ ప్రతి ఒక్క దానిలోనూ తాను ప్రవేశించి తన స్వరూపంగానే వాటి ననుభవించవచ్చు. అంతటా తానే అయినప్పుడన్నీ అనుభవింటంలో అభ్యంతరమేమున్నది.
ఇందులో మొదటిది వాడి స్వరూపస్థితి అయితే ఇది దానివల్ల అయత్న సిద్ధంగా కలిగే విభూతి. దీనినే ఐశ్వర్య Power of manifestation మని కూడా వ్యవహరిస్తారు. తద్వారా సర్వజ్ఞతతోపాటు సర్వశక్తులూ వాడికి వశపడతాయి. "సర్వకామః సర్వగంధః సర్వరసః సత్యకామః సత్యసంకల్పః” అని ఎంతగానో వర్ణించింది శాస్త్రం. ఏది కావలసి వస్తే అది తన సంకల్ప బలంతోనే సాధించగలడు ముక్తుడు. "సయదా పితృలోకకామోభవతి - తదా సంకల్పాదేవ పితర స్సముత్తిష్ఠంతే" ఎప్పుడు వాడు ఏ కాలాన్ని చూడాలన్నా ఏ భోగమనుభవించాలన్నా అన్నీ చూడగలడు. అనుభవించగలడు. మన పురాణాలలో నారద మహర్షి త్రిలోక సంచారమూ విశ్వామిత్రుని అభినవ సృష్టి ఇలాంటిదే. వ్యాసభగవానుడు ధృతరాష్ట్రాదులకు యుద్ధంలో చచ్చిన బంధుమిత్రాదుల నందరినీ కండ్లకు కట్టినట్టు చూపటంకూడా ఇలాంటిదే. అంతకుముందు విదురుడు ధృతరాష్ట్రునికి ఆత్మప్రబోధం చేయటానికి తన గురువైన సనత్సుజాతుణ్ని బ్రహ్మలోకం నుంచి రాత్రికి రాత్రి హస్తినాపురానికి ఆవాహన చేయటం కూడా మరి ఇలాంటి సత్యసంకల్పమే ఇలా ఎన్నో ఉన్నాయి సందర్భాలు. ఇవన్నీ జీవన్ముక్తి దశలో కలిగినసంఘటనలే అయినా కైముతిక న్యాయంచేత What then to speak of విదేహ ముక్తుడికిక చెప్పనే అక్కరలేదని ఊహించవచ్చు. కాబట్టి ముక్తిలో సుఖం కోసమని వెతుక్కోనక్కరలేదు. ఏ సుఖం కావలసినా ఉంది. హస్తిపాదంలో సమస్త జంతువుల పాదాలూ ఇమిడి పోయినట్టు అన్ని సుఖాలూ అందులోనే పొందుపడి ఉన్నాయి.
అయితే మరలా ఒక సందేహం. ముక్తుడంటే అన్ని బంధాలనుంచీ విడుదల అయిన వాడని గదా అర్ధం చెప్పారు. విదేహముక్తుడి విషయంలో అది అక్షరాలా సరిపోవాలి గదా. అలాంటప్పుడతడికీ సంకల్పాలూ - ఈ పితృలోకాది సందర్శనమూ ఎలా సంభవం.
Page 201