#


Back

   ఇప్పుడా ప్రారబ్ధకృతమైన శరీరం కూడా పోతుందని అర్ధం. పోతే ఇక పరంజ్యోతి ఏమిటి. భౌతికమైన సౌరచాంద్రమసాది జ్యోతులేవీ కావు. ఆత్మ చైతన్యమే ఆ జ్యోతి. దాన్ని పొందటమంటే అదే నేనని భావించటం. అభి నిష్పత్తి కూడా ఇక్కడ ఏదో మరో రూపంలో తయారవుతాడని కాదు. ఆ తయారయ్యే రూప మాగంతుకం కాదు. స్వరూపమే. స్వేనరూపేణ అనే మాటలోని స్వారస్యం గ్రహించాలి మనం. స్వేనరూపేణ అంటే ఆత్మరూపేణ అని అర్ధం. ఆత్మకేమిటి రూపం శుద్ధ చైతన్యమే. అదిప్పుడూ ఉన్నదేగదా ఆత్మకు. ఇక తయారయ్యేదేముంది. పోతే సర్వజ్ఞతా సర్వశక్తతాదులు కూడా చెప్పాడు జైమిని. కాదంటాడు ఔడులోమి అనే ఆచార్యుడు. పరవాలేదు. రెండూ ఉండవచ్చునన్నారు బాదరాయణులు. చైతన్యమనేది పారమార్ధికమైతే సర్వజ్ఞత్వాదులు వ్యావహారిక దృష్ట్యా చెప్పుకోవచ్చు నంటారాయన. ఇంతకూ తాను చేరేది ముక్తుడికి తన స్వరూపమే గాని అంతకన్నా భిన్నమైనది కాదు. అవిభక్తమైన ఆ స్వరూపమే ఇంతకుముందు శరీరాద్యుపాధుల మూలంగా విభక్తమై కనిపించింది. ప్రస్తుతమవన్నీ పూర్తిగా లయమైపోయాయికాబట్టి మరలా అవిభక్తంగానే అనుభవానికి వస్తుందని గ్రహించాలి మనం.

   శరీరాద్యుపాధి రహితుడెప్పుడయ్యాడో ఇక వాడికి సుఖదుఃఖాది సంసర్గమే లేదు. “అశరీరమ్ వావ సంతమ్ న ప్రియాప్రియే స్పృశతః" అనే ఉపనిషద్వాక్యానికిదే అర్ధం. శరీరమున్నంత వరకే ప్రియా ప్రియ సంపర్కం. అది లేకపోతే వాటి స్పర్శకూడా లేదు వాడికి. జీవన్ముక్తుడికే లేదు. ఇక విదేహముక్తుడి మాట చెప్పేదేముంది. అయితే మరి ముక్తులమై మనకిక సుఖమేమిటి. కేవల మీ సంసార దుఃఖం లేకపోవటమే కాదు గదా. దానిని మించి సాక్షాత్తుగా ఒక సుఖమనేది కూడా కలగాలి ముక్తుడికి. సుఖం కోసమే గదా మానవుడు ముక్తిని కోరటం. ఇంత కష్టపడి దాన్ని అందుకొన్న తరువాత దానిలో సుఖానుభవం లేదంటే ఏమి ప్రయోజనం గురువుగారి మరచెంబు కథే అవుతుందని ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న పూర్వం ఇంద్ర విరోచనులనే ప్రాజాపత్యులకే వచ్చింది. సర్వలోకాల మీదా ఆధిపత్యం కలిగి సకల సుఖాలూ అనుభవించే మార్గమేమిటో తెలపమని వారు పితామహుణ్ణి పోయి ప్రాధేయపడతారు. ఆయనక వారికి సర్వాత్మ భావ The subjective one ness of all creation రూపమైన బ్రహ్మవిద్యనుపదేశించి ఇదే దానికి జవాబు పొమ్మంటాడు. బ్రహ్మవిద్యవారి ప్రశ్నకైలా జవాబయింది.

Page 200