#


Back

   ఇప్పుడది ఎక్కడ చేతికి తీసుకొని చూచినా జలమే జలం. అలాగే విదేహముక్తుడికిక ప్రపంచ వాసనలేదు. నామరూపాత్మకమైన ఈ ప్రపంచమంతా ఒక లవణ పిండం మాదిరే మరి చైతన్య రసంలో కరగి చిదేక రసంగానే అనుభవానికి వస్తుంది. అప్పుడంతా వాడికి చైతన్యమే చైతన్యం. మరేదీలేదు. ఇలా ముక్తుడైన మానవుడే మరలా ముక్తుడవుతున్నాడు. అప్పుడు సదేహముక్తుడైతే ఇప్పుడు విదేహముక్తుడు. అందుకే "విముక్తశ్చ విముచ్యతే" అని చాటుతున్న దుపనిషత్తు.

   పోతే ఇక ఈ విదేహముక్తి లభించిన తరువాత దాని స్వరూపమేమిటి తన్మూలంగా జీవిత పరమార్థం మనకెలా సిద్ధిస్తున్నదని ప్రశ్న. విదేహముక్తుడికి జీవన్ముక్తుడికున్న ప్రారబ్దకర్మ కూడా లేదు. ఆ దశ అందుకొనే సరికి కర్మకోశమంతా నిశ్శేషంగా విశ్రాణితమై పోతుంది. దానితో శరీర సంబంధమూ పోయింది.

   ప్రపంచ సంబంధమూ పోయింది. పిండాండ బ్రహ్మాండాలు రెండూ పోతే ఇక ఆ ముక్తుడెక్కడ ఉన్నట్టు. ఎక్కడ అని ప్రశ్నే లేదు. ఎక్కడా ఎప్పుడనేవి దేశకాలాలు Space & Time అవి రెండూ వాడి స్వరూపమే అయి వాడిలోకే వచ్చేశాయి. కాబట్టి వాడిక ఎక్కడైనా ఉండాలంటే ఎక్కడా ఉండలేడు. తను దాన తాన అన్నట్లు తనలో తానే ఉండాలి. "స్వమహిమ్ని ప్రతిష్ఠితః" అన్న దుపనిషత్తు. మహిమ అంటే విస్తారం Expanse. తన విస్తారంలో తానున్నదట ఆ బ్రహ్మం. ముక్తుడూ ప్రస్తుతం బ్రహ్మమే అయ్యాడు కాబట్టి తనలోనే తానుంటాడు. అంటే ఏమన్నమాట. సచ్చిద్రూపంగా సర్వమూతానే అయిపోతాడని తాత్పర్యం. సర్వత్రా సర్వ పదార్థాలలో ఉన్నదనే గదా.

   దీనినే “అస్మాచ్ఛరీరా త్సముత్థాయ - పరమ జ్యోతి రూపసంపద్య స్వేనరూపేణ అభినిష్పద్యతే” అని శాస్త్రం వర్ణించి చెబుతున్నది. ఈ శరీరం నుంచి లేచిపోయి తదతీతమైన జ్యోతినాశ్రయించి తన స్వరూపాన్ని తాను పొందుతాడట. లేవటం, ఆశ్రయించటం, పొందటమనేసరికి మరలాద్వైత దృష్టి ఏర్పడవచ్చు మనకు. అలాంటి భ్రాంతి పడనక్కరలేదంటారు భాష్యకారులు శరీరం నుంచి లేవటమంటే అంతకు ముందు జీవన్ముక్త దశలో శరీరాత్మ భావమెలాగూపోయింది.

Page 199