#


Back

   కేవలం లోకదృష్టికి మాత్రమే అలా భాసిస్తుంది. అతని దృష్టికది తన చైతన్యానికొక ఛాయ Shadow మాత్రమే. అంతకు మించి అస్తిత్వం లేదు దానికి. దీనికే దగ్ధపటవత్తని వర్ణించారు వేదాంతులు. కాలి మసి అయిపోయిన వస్త్రం లాంటిదది. మసి అయిన వస్త్రం మడతలు అలాగే కనపడుతుంటాయి. అయినా సుఖం లేదు. కట్టటానికి లేదు ఒకరికి పెట్టటానికి లేదు. అలాంటిదీ వాడికంటుకొన్న ఈ శరీరాది సంఘాతం. కాగా ఇప్పుడా అంటుకొన్న శరీరం కూడా తుప్పులాగా రాలిపోయింది. అంతే తేడా. అయితే ఎంత చెడ్డా శరీరమున్న నేరానికప్పుడాకలి దప్పులని, కష్టసుఖాలని ఇలాంటివి అనుభవించక తప్పింది కాదు. ఇప్పుడో ఆ అనుభవం కూడా లేదు.

   ఈ రెండవస్థలకూ ఉన్న తేడా మన మనస్సుకింకా స్పష్టంగా బోధపడటానికి సంప్రదాయజ్ఞులొక రెండు చక్కని దృష్టాంతాలు కూడా ఉదహరిస్తారు. ఒకటి దారుగజ దృష్టాంతం. ఇంకొకటి లవణజల దృష్టాంతం. ఒక కొయ్యలో ఏనుగును నిర్మించి కొంత దూరాన ఒకచోట నిలిపారనుకోండి. ఏమీ తెలియని పిల్లలది దారువనేసంగతే మరచి నిజంగా ఏనుగేనని గుడ్లప్పగించిచూస్తుంటారు. కాని అన్నీ తెలిసిన పెద్దమనిషి అలా ఎన్నటికీ చూడడు. అతడి కది దారువుతో తయారయిన పదార్ధమని తెలుసు. ఆ మేరకు దారు దృష్టి ఉంది. అలాగే ఆ దారువులో చెక్కిన శుండా దంతకర్ణ పాదోదరాది విశిష్టమైన ఒక ఆకృతిని కూడా చూస్తుంటాడు. ఆ మేరకు గజదృష్టి కూడా ఉంది. అయితే దారువనే మూల ద్రవ్యాన్ని మరిచిన గజదృష్టి కాదది. దారువనే అధిష్ఠానాన్ని Substance or Stuff పట్టుకొనే గజాకృతిని కూడా చూస్తుంటాడు. అలాగే చూస్తాడు జీవన్ముక్తుడీ ప్రపంచాన్ని. దీన్ని పూర్తిగా వదల లేదతడు. అలాగని బ్రహ్మతత్త్వాన్ని మరవలేదు. బ్రహ్మమనే అధిష్ఠానంలో శరీరాది ప్రపంచాన్నంతా దర్శిస్తాడు.

   పోతే విదేహముక్తుడి దశ ఇంతకన్నా అతీతమైనది. అది లవణజలం లాంటిదని వర్ణిస్తారు. ఒక లవణ పిండం జలంలో కలిసిపోతే ఇక జలంకన్నా అది వేరుగా ఎక్కడా కనిపించదు. జలమే ఒకప్పుడు లవణమై మరలా ఇప్పుడది జలమే అయి కనిపిస్తున్నదంత మత్రమే.

Page 198