“యద్భావస్తద్భవతి” అని గదా అభిజ్ఞుల మాట. “సదాతద్భావ భావితః" అని భగవద్గీత కూడా చాటుతున్నది. మొదటి నుంచీ శాస్త్రాచార్యోపదేశ జనితమైన జ్ఞానమొకటి పని చేస్తున్నది. ఆ జ్ఞానదీపం నిత్యమూ ప్రకాశిస్తుంటే ఆ వెలుగులోనే గడిపాడు జీవితమంతా. చివర కవసాన సమయంలో కూడా ఆ వెలుగులోనే సర్వత్రా పరిచినట్టు కనిపించే తన సర్వాత్మ భావంతోనే తాను తాదాత్మ్యం చెందుతున్నాడు. ఇకవాణ్ణి ఈ ప్రకృతి ధర్మాలనే రాజపురుషులేమీ చేయలేవు. తమకట్లు విప్పుకొని వెళ్లిపోతుంటే గుడ్లప్పగించి చూస్తుండవలసిందే.
పోతే అనృతాభిసంధుడనే వాడిక్కడ మామూలు సంసారి. వీడికింకా ఆ బ్రహ్మజ్ఞానమనేది ఉదయించలేదు. జీవితమంతా పామరంగానే బ్రతుకుతుంటాడు. వాడు మనసుతో మాటతో కాయంతో పట్టుకొని కూచున్నదంతా ఈ సాంసారికమైన భావాలే. అవి సదాభాసలే గాని ఎప్పుడు సత్యం కావు. అంటే నూటికి నూరుపాళ్ళూ అనృతమే. ఇలాంటి అనృతాన్నే జీవితాంతమూ తన సర్వస్వమని భావిస్తూ కూచున్నాడు. కాబట్టి చివరకు చచ్చేనాడు కూడా దాని సంస్కారాలతోనే చస్తాడు మానవుడు. అంటే తేజోమాత్రలో చేరిన జీవుడు సదాఖ్య తత్త్వాన్ని దర్శించే జ్ఞానజ్యోతిని కోలుపోయి ఆ మహాతమస్సులో తదాభాస అయిన అవిద్యారూపిణి అయిన బీజశక్తి ఒడిలోనే పోయి పడతాడు. పడగానే అది సత్యాన్ని కప్పి పుచ్చటమే కాబట్టి ప్రకృతి శక్తులనే రాజభటులు నలుగురు చేరి వీడు అబద్ధాలకోరని చెప్పి చావబాదుతారు. అంటే ఏమన్నమాట. మరలా భద్రంగా తెచ్చి ఈ సంసారమనే బందిఖానాలో తోసిపోతారని భావం.
అంచేత ముక్తుడికీ బద్ధుడికీ మరణ క్రమమనేది సమానమే అయినా ముక్తుడు సత్యాభిసంధి గనుక బద్దుడిలాగా మరణించడు. అంటే మరలా దేహసంబంధమనేది లేదు వాడికి. సత్సాయుజ్య సంపన్నుడయి అలాగే నిలిచి ఉంటాడు. ఎక్కడ ఎలా అనే ప్రశ్న కూడా లేదు. సత్యమనేది సర్వత్రా సర్వదా ఉంది గనుక సర్వత్రా సర్వదా సర్వమూ తానే అయి ఉంటాడు. అంతకుముందు కూడా ఆ మాటకు వస్తే సర్వత్రా ఉన్నవాడే. ఎందుకంటే జీవించి ఉండగానే ముక్తుడయ్యాడతడు. అయినా ప్రారబ్ధమింకా తీరలేదు కాబట్టి ఒక శరీరమనేది అతణ్ని కరచుకొని ఉన్నది. అలా ఉన్నా అది భాధితాను వృత్తి Continues though contradicted రూపమే కాకుండా అతడికి నిజంగా బాధకం కాదు.
Page 197