#


Back

   కాబట్టి ఇంతకూ జీవన్ముక్తులైన వారటు ఏకాంత వాసులే గాక లోక సంగ్రహార్ధం సంచరించే మహాత్ములు కూడా ఉన్నారని అర్ధమవుతున్నది. అయితే మన మధ్యలో తిరుగుతూంటే వీరు కూడా మనలాంటి సామాన్యులేనని వారి నవజ్ఞా దృష్టితో Disdainful look చూడటం లోకుల కలవాటు. "అవజానంతి మామ్ మూఢా మానుషీమ్ తను మాశ్రిత”మ్మని భగవానుడే మొరపెట్టాడు. ఇకమిగతా వాళ్ళను గురించి చెప్పేదేముంది. తెలివైన వాడైతే అలాటి మహానుభావులను గుర్తించి వారి దర్శనం చేసుకొని ప్రణిపాత పరిప్రశ్న సేవాదులచేత వారి మనసు నావర్ణించి తదుపదేశ భాగ్యం వల్ల తన జన్మ కడతేర్చుకొని పోతాడు. అలాగైతేనే వారు తలపెట్టిన పరమేశ్వరుడు వారి కప్పగించిన లోకసంగ్రహరూపమైన అధికారం చరితార్ధమవుతుంది.

   ఈ ప్రకారంగా జీవన్ముక్తులై వారు తమ అధికారం నెరవేర్చిన తరువాత వారూ ఆ మొదట చెప్పిన ఆత్మారాములూ-అందరూ కూడా వర్తమాన శరీరపాతం కాగానే ఇక విదేహముక్తినే పొందుతారు. విదేహమంటే దేహం పోవటమేనని మరలా అపోహ పడరాదు. దేహం పోవటమే ముక్తి అయితే ప్రాకృత మానవులు Ordinary persons కూడా మరణ సమయంలో దేహాన్ని కోలుపోతూనే ఉన్నారు. అప్పటికి వారు కూడా విదేహ విముక్తులేనని చెప్పవలసి వస్తుంది కాబట్టి దేహపాత మాత్రం కాదు విదేహమంటే మరలా ఇక దేహమనేది లేకపోవటమని అర్ధం చెప్పారు భగవత్పాదులు. ఎందుకంటే ఈ దేహ ప్రయోజనం ప్రారబ్దావసానంతో తీరిపోతుంది. మరి సంచితాగామి కర్మలా జ్ఞానాగ్ని చేత ఎప్పుడో దగ్ధమయి పోయాయి. అంటే ఏమన్నమాట. కర్మవాసన అనేది లేశమాత్రం కూడా మిగలలేదు జ్ఞానికి. కర్మలేకపోతే జన్మలేదని పేర్కొన్నాము గదా. అంచేత జీవన్ముక్తుడికి శరీరం పోవటమే తడవు. ఇక శరీరమూ లేదు. జన్మ ఎత్తటమూలేదు. అందుకే దీనికి విదేహముక్తి అని వ్యవహార మేర్పడింది.

   అయితే శరీరం పతనమై పోవటమందిరికీ సమానంగానే కనిపిస్తున్నది గదా జీవన్ముక్తుడి శరీర పాతంలో ఉన్న విశిష్టత ఏమిటని ప్రశ్న వస్తుంది. జీవన్ముక్తుడి ప్రాణాలెక్కడికీ పోవు.

Page 194