వారంతా వరుణుడు చేసిన ఒకానొక యజ్ఞంలో మరలా సంభవించారని ఐతిహ్యం. అంతెందుకు. సనత్కుమారుడు కూడా మానసపుత్రుడే. రుద్రుడికి స్వయంగా వరప్రదానం చేసి ఆయన స్కందుడనే పేరుతో అవతరించాడని ఉంది. ఇవన్నీ ఇతిహాస పురాణాదులలో కనిపించే ఉదంతాలు. పోతే వేదంలో ఇక మంత్రార్ధవాద భాగాలను పరిశీలిస్తే ఎన్నైనా దొరుకుతాయి ఇలాంటి గాధలు మనకు.
ఇందులో కొందరు వెనుకటి దేహం పతనమైన వెనుక దేహాంతరాన్ని స్వీకరించారు. మరికొందరీ దేహముండగానే యోగైశ్వర్య ప్రభావంతో Wielding the cosmic power మరొక దేహాన్ని సృష్టించుకొని అందులో ప్రవేశిస్తూ వచ్చారు. వీరందరూ సక్రమంగా వేదార్ధాన్నంతటినీ ఆ పోశనం పట్టిన మహామేధావులు. వీరంతా ఇలా శరీరాలు మార్చుకొంటూ జన్మిస్తూ వచ్చారంటే ఏమిటర్ధం. ప్రారబ్ధం తీరేవరకూ లోక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పరమేశ్వర ప్రచోదితులై వేదధర్మాన్ని ప్రచారం చేసి అధికారాన్ని చేపడుతారు. ప్రారబ్ధం కడముట్టగానే ఒక క్షణకాలమైనా ఉండరిక. వెంటనే విదేహ కైవల్య సుఖాన్ని చూరగొంటారు.
ఈ ప్రకారంగా ఒక మహర్షులే గాదు. ఆయా దేవతలూ - దేవతా జ్యేష్ఠుడైన హిరణ్యగర్భుడూ ఆ మాటకు వస్తే మనకిపుడు ప్రత్యక్షంగా కనపడే ఈ సూర్య భగవానుడూ - వీరు కూడా నిజాని కాయా అధికారాలలో నియుక్తులైన ముక్తజీవులే. జగచ్చక్షు The eye of the world వైన ఈ సూర్యదేవుడైతే ఒక వేయియుగాలదాకా తన అధికారాన్ని నిర్వర్తించి దాని పర్యవసానంలో ఉదయాస్తమయ వర్జితమైన కైవల్య సుఖాన్ని అనుభవిస్తాడని వేదంలోనే ఉంది. “అథ తత ఊర్ధ్వ ఉదేత్య -నైవో దేతా - నాస్తమేతా ఏకల ఏవ మధ్యే స్థాతా" అని శ్రుతి వచనం. అయితే ఇదంతా ఏ శ్రుతులలోనో స్మృతులలోనో ఎప్పుడో మనకు తెలియని కాలంలో జరిగిన కథలని సందేహించవచ్చు మానవుడు దానికి కూడా సమాధానమిచ్చారు శంకరులు. అప్పుడే కాదు. ఇప్పుడీ వర్తమాన కాలంలో కూడా అలాంటి బ్రహ్మవేత్త లెందరో ఉన్నారని ఎంతో ఆత్మవిశ్వాసంతో చాటిస్తారాయన. “యథాచ వర్తమానా బ్రహ్మవిదః ఆరబ్ద భోగక్షయే కైవల్యమను భవంతి" ఇది మన బోటి సాధకుల కెంత ఆశాజనకమైన మాటో గదా.
Page 193