పోతే ఈ జీవన్ముక్తులనే వారు మరలా రెండు వర్గాలు. ఒకరు ఆత్మారాములు. మరి ఒకరు లోక సంగ్రహ పరాయణులు ఇందులో ఆత్మారాములనేవారు మనకు కనిపించరు. ఏ హిమాలయాలకో ఎక్కడికోపోయి అక్కడే బ్రహ్మనిష్ఠలో ఉంటారు. వారు. వారికీ లోకంతో ప్రమేయం లేదు. “యస్వాత్మ రతిరేవ స్యాత్... తస్యకార్యమ్ న విద్యతే” అని భగవానప్యువాచ. పోతే లోకసంగ్రహ పరులే మనమధ్య తిరుగుతుండే ఆచార్యపురుషులు. వీరికే ఆధికారికులని కూడా పేరు. ముక్తులైనా వీరు తమ ప్రారబ్ధకర్మ ముగిసేదాకా బ్రతుకుండాలి కాబట్టి వారికా నిత్యముక్తుడైన ఈశ్వరుడొక కర్తవ్యదీక్ష నొప్పగిస్తాడు. దానికే అధికార Divine Deputation మని పేరు. జిజ్ఞాసువులూ ముముక్షువులూ అయిన లోకుల నుద్ధరించటమే ఈ అధికారం. అందు కవసరమైన బోధలు చేస్తూ దేశంలో అక్కడక్కడ సంచారం చేస్తుంటారు. వీరు. శంకరులవంటి ఆచార్యులంతా ఇలాంటివారే. వీరికందరికీ ప్రారబ్ధకర్మ అనేది అంతో ఇంతో అంటుకొని ఉంటుంది. అది ఒకవైపు అనుభవిస్తూనే వీరు తమ వాక్కులద్వారా రచనల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని లోకులకు పంచి పెడుతుంటారు. ప్రారబ్దావసానంలో తాము విదేహముక్తులయి మరికొందరిని జీవన్ముక్తులుగా తయారుచేసి పోతారు.
ఈ రీతిగా గురుశిష్య సంప్రదాయమనేది అవిచ్ఛిన్నంగా ఈ మానవ లోకంలో సాగుతూ పోతుంది ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించటానికే నిత్యముక్తుడైన భగవాను డీముక్త జీవులైన ఆచార్యులందరికీ ఇలాంటి సంకల్పాన్ని కలిగిస్తాడు. అలా కలిగించిన వారే పూర్వం వేదవ్యాసాది మహర్షులంతా నని చాటుతారు భగవత్పాదులు. వ్యాస భగవానుడు మొదట అపాంతరతముడనే వేదాచార్యుడు. అంతరమైన తమస్సు అపాకృతమైన వాడు. పురాణముని. విష్ణుదేవుని ఆదేశానుసార మాయన కలిద్వాపర సంధిలో కృష్ణద్వైపాయనుడనే పేర జన్మించాడట. మరి వసిష్ఠ మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. నిమి అనే వాడి శాపం నిమిత్తంగా పూర్వదేహం కోలుపోయి మరలా మిత్రావరణులు మూలంగా జన్మ ఎత్తాడట. కనుకనే ఆయనకు మైత్రావరుణి అని పేరు వచ్చింది. పోతే భృగ్వాదులు కూడా బ్రహ్మ మానసకుమారులే.
Page 192