దీనిని బట్టి మనం గ్రహించవలసిన రహస్యమేమంటే జీవన్ముక్తి అనేది లేదని గాదు. నిరాఘాటంగా ఉన్నది. ఉన్నప్పటికీ ఆ దశలో ప్రారబ్దమింకా పని చేస్తుంది కాబట్టి శారీర లౌకిక కర్మలు నిర్వర్తించే సమయంలో తన స్వరూప స్థితి సడలకుండా కడుజాగ్రతతో మెలగాలి జీవన్ముక్తుడు. అదే జ్ఞాన నిష్టా లక్షణమైన నిదిధ్యాసన. “సదా పరి సంచక్షాణః" అని భాష్య పంక్తి నింతకు ముందొకచోట ఉదహరించి ఉన్నాము. పరిసంఖ్యానమంటే ఎప్పటికప్పుడు తన ఆత్మ భావాన్ని గుర్తుకు తెచ్చుకోటం అలా తెచ్చుకొంటూ పోతే అనాత్మ వ్యవహారమంతా దానిలో ప్రవిలయంకావటమిక అయత్న సిద్ధం. దానితో ఆత్మైక నిష్ఠా రూపమైన ముక్తి నిక్షేపం సురక్షితమవుతుంది. "ముంజా దిషీకామివ దృశ్యవర్గా- త్ప్రత్యంచ మాత్మాన మసంగ మవ్యయమ్ వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వమ్ - తదాత్మనా తిష్ఠతి యస్సముక్తః" అని ఆచార్యులవారి చూడామణి. తములపాకు నుంచి ఈనె తీసినట్టు మొదట ఈ ఉపాధి వర్గం నుంచి ఆత్మను వేరుగా పట్టుకొని ఆ స్వరూపంలోనే మరలా ఈ సమస్తమూ ఎప్పటికప్పుడు ప్రవిలాపనం చేసుకొంటూ తద్రూపంగా నిలవ గలిగితేనే వాడు ముక్తుడు. లేకుంటే సక్తుడే.
ఇలా జీవితాంతమూ నిలుపుకొనే ప్రయత్నమే అయితే ఇక అది ముక్తి ఎలా అవుతుందని ఆక్షేపణ రావచ్చు. ఎప్పటికప్పుడు ప్రవిలాపనం జరుగుతూ పోతుంది కాబట్టి ముక్తే అది. యావజ్జీవమూ ఈ విధంగా అనుసంధాన యత్నంతో ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ పోతే - చివరకా ప్రారబ్ధం తీరి శరీరపాతమయ్యే క్షణానికిటు లోక వ్యవహారమూ అటు అనుసంధాన ప్రయత్నమూ రెండూ సుందోప సుంద న్యాయంగా సమకాలంలో సమసిపోతాయి. పోతే ఇక దేహధారణమనే ప్రసక్తే లేదు కాబట్టి స్వరూపనిష్ఠ కెలాటి విచ్ఛేదమూ లేక అది విదేహముక్తిగానే పరిణమిస్తుంది. అంచేత ఇంతకూ జీవన్ముక్తి అనేది సంభవమే. అది బ్రహ్మవేత్తలైన మహాత్ములందరికీ స్వానుభవ సిద్ధమే. ప్రారబ్ధ నిమిత్తంగా లోకవ్యవహార మడ్డు తగులుతున్నా ఎప్పటికఎప్పు డాత్మాను సంధాన మేమరకుండా ప్రవిలయ మవుతుంటుంది కాబట్టి మోక్షానుభవమ ప్రతిహతమే. ఇందులో సందేహ గంధం కూడా లేదు.
Page 191