జ్ఞాన నిష్ఠకు మారుపేరీ అనన్య భక్తి. "తత్రచ సర్వమ్ నివృత్తి విధాయి శాస్త్రమ్ వేదాంతేతి హాస పురాణ స్మృతి లక్షణమ్ న్యాయప్రసిద్ధమ్ అర్థవద్భవతి" ఇందులోనే మోక్ష పురుషార్ధ బోధకమైన ఉపనిషత్పురాణేతి హాసాది వాఙ్మయమంతా తత్తన్న్యాయ కలాపంతో సహా చరితార్ధమవుతుందని ముక్తకంఠంతో చాటుతారు అద్వైత కంఠీరవులాచార్యులవారు. ఇంతుకు మించి మరేదీ లేదు సాధక జీవితానికి పరాకాష్ఠ Climax.
ఇలాంటి నిష్ఠ నిలుపుకోగలిగినప్పుడే అది ముక్తి. అయితే నిలుపు కోటమనేది అంత సులభం కాదని చెప్పాము. కారణం ముక్తుడింకా దేహధారి అయి ఉండటమే. దేహమున్నా దేహాభిమానం లేకుంటే అది ముక్తేనన్నారు గదా అని ఆశంక చేయవచ్చు. వాస్తవమే. సిద్ధాంతమదే అయినప్పటికీ దైనందిన జీవితంలో అడపా దడపా కొంత శైథిల్యమేర్పడవచ్చు. దానికి కారణ మీ శరీర ధారణమే అందుకు నిమిత్తం ప్రారబ్ధమే. తన్నిమిత్తంగా కలిగే క్షుత్పిపాసాది వ్యవహారానికైనా లోనుగాక తప్పదు జ్ఞాని. అయితే ఆ మేరకు బ్రహ్మనిష్ఠలో కొంత వార చోటు చేసుకోకపోదు. ఈ విషయమే మాండుక్యకారికా భాష్యంలో ఒక చోట బయట పెడతారు భగవత్పాదులు. “చలాచల నికేతశ్చ యతి ర్యాదృచ్ఛికో భవేత్" అనే కారికార్ధాన్ని వాఖ్యానిస్తూ “చలమ్ శరీరమ్ ప్రతి క్షణ మన్యథా భావాత్ అచలమ్ - ఆత్మతత్త్వమ్ యదా కదాచి ద్భోజనాది సంవ్యవహార నిమిత్త - మాకాశవ దచలమ్ స్వరూప మాత్మ తత్త్వమ్ ఆత్మనో నికేత మాశ్రయం ఆత్మస్థితిం విస్మృత్య- అహమితి మన్యతే యదా తదాచలో దేహో నికేతో యస్య సోయ మేవం చలా చల నికేతో యతిః" అని అర్ధం చెప్పారాయన. చలాచల రూపమైన నికేతం లేదా స్థితి గలవాడెవడో వాడట యతి. చలమేమిటి. అనుక్షణమూ ఏదో ఒక క్రియతో మారిపోయే శరీరమే చలం. స్నానపాన భోజనాదులే ఆ క్రియలు. తన్నిమిత్తంగా తాను అచలమైన ఆత్మ స్వరూప స్థితిలో ఉండి కూడా దాని నప్పుడప్పుడూ విస్మరించవలసి వస్తుంది. విస్మరించిన దశలో చలనికేతుడవుతాడు యతి. మరలా స్మృతి వహిస్తే అచల నికేతుడే అనిపించుకొంటాడు. అయితే యదృచ్ఛా ప్రాప్త గ్రాసవాస కౌపీనా చ్చాదన మాత్ర సంతృప్తుడే గాని బాహ్యవిషయ సంజాత తృష్ణుడు కాడని మాత్రమే మనం సంతోషించవలసింది. ఈ మాటలలో ఉన్న సత్యాన్ని నిర్భయంగా చాటారు స్వామివారు.
Page 190