#


Back

   సిద్దాంతం కోసమొక వేళ అది ముక్తి అని ఒప్పుకొన్నా ప్రారబ్ధమింకా అంటుకొని ఉన్న నేరానికి దాని ధాటి కెప్పటి కప్పుడు జవాబు చెప్పే ఆత్మాను సంధానం మాత్రం సాగుతూ పోవలసిందేనని సలహా ఇస్తారు. భగవత్పాదులు కూడా. మరి ముక్తే గదా అంటే వాస్తవమే. ముక్తి కాదనలేదు మేము. అలాగే భావించి నిలుపుకొన్నప్పుడే అక్షరాలా అది ముక్తి అవుతుంది. ఎంత పెద్ద పిత్రార్జితమైనా దక్కించుకొంటేనే గదా మన ధనమయ్యేది. లేకపోతే అది ఎవరిదో. "పయః పిబతి యస్తస్యా - ధేనుస్త స్యేతి నిశ్చయః" అన్నారు వ్యానులవారు. ఈగో వెవరిదని ప్రశ్న వచ్చిందట. ఎవరు దాని పాలుతాగే అదృష్టానికి నోచుకొంటే వారిదేనని జవాబిచ్చారు. ఆ అదృష్టం దాని దూడదైనా కావచ్చు. దొంగదైనా కావచ్చు. ఆ ఇంటి యజమానిదైనా కావచ్చు. ఎవరు దక్కించుకో గలిగితే వారిదా సొమ్ము. అలాగే ఈ ముక్తావస్థ కూడా.

   అందుకే “విజ్ఞాయ ప్రజ్ఞామ్ కుర్వీత” అని ఘోషిస్తున్న దుపనిషత్తు. విజ్ఞానం అసలు విషయం తెలిసి పట్టుకోటానికైతే ప్రజ్ఞాన మాపట్టిన పట్టు పట్టు వదలకుండా నిలుపుకోటాని కన్నారు స్వామివారు. దీనికే నిదిధ్యాసనమని శాస్త్రం పేరు పెట్టింది. విజాతీయ భావ తిరస్కారి అయిన సజాతీయ భావ ప్రవాహకరణమే నిదిధ్యాస. తిరస్కరణమంటే ప్రవిలాపనమే. ప్రవిలాపన చేయవలసింది దీన్ని. విజాతీయ భావాన్నా. ఆత్మ చైతన్యానికి విజాతీయ మీ అనాత్మ జగద్వాసనలే. అవి నిశ్శేషంగా కరిగిపోవాలి. దేనిలో. సజాతీయ భావాగ్నిలో. అది ఆత్మాకారమైన వృత్తే. ఆ వృత్తి నిత్యమూ ఆ వృత్తి అవుతూపోతే గాని ఆత్మవృత్తి నిలవదు. ఇలా నిలుపుకొంటేనే అది ముక్తి అనిపించుకొనేది. దీనికే జ్ఞానాభి నివేశమనీ - సంతానకరణమనీ రెండు పేర్లు పెట్టారు ఆచార్యులవారు. జ్ఞాన నిష్ఠ అన్నా ఇదే, పరాభక్తి అనీ - అనన్య భక్తి అనీ దీనికే మరొక పేరు. భక్తి అంటే మామూలుగా మన మనుకొనేది వేరు. ఇది వేరు. మన మనుకొనే భక్తి బ్రహ్మజ్ఞానానికి ముందుండ వలసింది. అది జ్ఞానానికి పూర్వరంగం. సగుణరూపమది. పోతే ఇది అలాంటిది కాదు. నిర్గుణమైనది. జ్ఞానం మనకు లభించిన తరువాత కలిగే భక్తి ఇది. దీనికీ భక్తి అనే పేరు పెట్టటంవల్ల భాగవతాది గ్రంథాల తాత్పర్యం పెద్ద పండితులకు కూడా అంతు పట్టటం లేదు. అందుకే దీన్ని పేర్కొనవలసి నప్పుడల్లా గీతాచార్యుడనన్య - పరా - అనే మాటలు ముందు తగిలిస్తుంటాడు.

Page 189