ఇలాంటిదీ బ్రహ్మవేత్తలైన ముక్తపురుషుల అనుభవం. వారాకాల మీకాల మనకుండా ఏ కాలంలోనైనా ఉంటారు. మన మధ్యనే తిరుగుతుంటారు కూడా. అయినా వారి వ్యవహారం మనకేమాత్రమూ అంతుపట్టదు. కారణం వారు నిరంతరం బ్రహ్మాకార వృత్తితో జీవయాత్ర గడుపుతుంటారు. “నిమేషార్ధమ్ - నతిష్ఠంతి వృత్తిమ్ జ్ఞానమయీమ్ వినా - యథా తిష్ఠంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః" అర నిమిషం కూడా బ్రహ్మవృత్తి నెడబాసి ఉండరు వారు. అలా ఎడబాయకున్న వారేనట ఇప్పుడు సత్యలోకంలో పద్మాసనాసీనుడైన చతుర్ముఖ బ్రహ్మా సనకసనంద నాదులైన మహర్షులు - శుక ప్రముఖులైన భాగవతులూ ఏ మాత్రమే మరుపాటు చెందినా మరలా ఈ సంసార వాసనలు క్రమ్ముకొనే ప్రమాదముంది. వారు ముక్తజీవులు గదా అంటే ఎంత ముక్తులైనా ప్రారబ్ధమనే దొకటి ఉందనే సంగతి మరచిపోరాదు. ధృతరాష్ట్రుడికి లాగా వెయ్యేనుగుల బలముంది దానికి. దగ్గర చేరిందంటే ఉక్కులాంటి వ్యక్తినైనా నుగ్గు నూచం చేయగలదు. ఊచముట్టగా జ్ఞాన ధనాన్ని దోచుకొని పోగలదు. అందుకే అసలు ఆహారం దగ్గరినుంచీ శుద్ధి కావాలన్నారు. ఆహార శుద్ధె సత్త్వశుద్ధిః ఆహారం మొదట శుద్ధి అయితేనే సత్త్వం శుద్ధి అవుతుంది. ఆహారమనేది రెండు విధాలు. భౌతికం-మానసికం కూడా రెండూ పరిశుద్ధమైతే అదీ రజస్తమో మాలిన్యాన్ని పోగొట్టి సత్త్వాన్ని శోధిస్తుంది. సత్వశుద్ధా ధ్రువాస్మృతిః అన్నారు. శుద్ధసత్వం వల్ల బ్రహ్మ భావన దృఢంగా నిలుస్తుందట. “స్మృతిలంభే సర్వగ్రంథీనామ్ విప్రమోక్షః” అది నిలిస్తే ఇంకేముంది. “భిద్యతే హృదయ గ్రంథిః" అన్నట్టు జీవిత సమస్యలన్నీ పటాపంచలయి మోక్షం కరతలామలక మవుతుందని హామీ ఇస్తుంది ఛాందోగ్యం అందుచేత బహు జాగ్రత్తగా ఉండాలి ఎంత జ్ఞాని అయినా ముక్తుడయినా.
అసలిక్కడ ఉన్న చిక్కేమిటంటే జీవన్ముక్తుడికి ప్రతివాదులు చెప్పినట్టు దేహమనే ప్రతిబంధమింకా ఒకటున్నది. అది ప్రారబ్ద సంతానమే కాబట్టి ఉన్నంత కాలమూఏదో ఒక సంతాపాన్ని కలిగిస్తూనే ఉంటుంది. దానితో ఆ బ్రహ్మాత్మ భావాన్ని నిరంతరమూ మనం నిలుపుకోట మంత సుకరం కాదు. "అవ్యక్తా హిగతిర్దుః ఖమ్ దేహవద్భి రవాప్యతే” అని భగవానుడు కూడా దేహధారుల కా పదవి అంత సులువుగా దక్కదని హెచ్చరిస్తున్నాడు.
Page 188