#


Back

   ముందు చెప్పినట్లు మొదట మనకసలు గురు శుశ్రూషా వేదాంతార్థ శ్రవణమేలేదు. కొంచెమున్నప్పటికి సరియైన ప్రమాణాలలో మనం పరిశ్రమ చేయము. అలా చేస్తున్నా బాహ్య విషయాలమీద ఉన్నంత ఆసక్తి వాటిమీద ఉండబోదు. అలాంటప్పుడంత గొప్ప అనుభవం కలగాలంటే ఎలా కలుగుతుంది. తీర్థానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదమన్నట్టే ఉంటుంది మన వ్యవహారం. అక్కడే ఉన్నా - అత్యంత ప్రసిద్ధమైనా, అతి సులభమైనా, ఆత్మభూతమే అయినా అది మన సొమ్ముగాదు. అదే నిరంతరాభ్యాస శీలుడైన సిద్ధపురుషుడికైతే ముందు చెప్పిన సాధన సమగ్రి పరిపాకముంది కాబట్టి అసలీ ప్రపంచం ప్రపంచంగానే కనిపించదు. “లౌకిక గ్రాహ్యగ్రాహక ద్వైతవస్తుని సద్బుద్ధి ర్నితరామ్ దుస్సంపాదా - ఆత్మచైతన్య వ్యతిరేకేణ వస్త్వంతర స్యానుపలబ్ధిః" అంటారు భగవత్పాదులు. లోకులంతా ఇది నాకు గ్రాహ్యమైన ప్రపంచమనీ నేను నా జ్ఞానంతో దీనిని గ్రహిస్తున్నాననీ ద్వైతదృష్టితో చూస్తుంటే ఈ ముక్తుడు దానినంతా తన ఆత్మచైతన్య విభూతిగానే దర్శిస్తాడు. ఆత్మకంటే భిన్నంగా వాడికేదీ లేదు. అది కూడా పరోక్షం కాదు. అపరోక్షమే వాడికి. దాని విషయం తెలియక పూర్వమది తనకు పరోక్షంగా ఎక్కడో ఉందనే అపోహ ఉన్నా ప్రస్తుతమది ఫలానా అని ప్రత్యిభిజ్ఞ Recognition ఎప్పుడు కలిగిందో ఇక ఎక్కడ బడితే అక్కడ అది అపరోక్షంగానే సాక్షాత్కరిస్తుంది. అలాంటి సర్వాత్మకమైన అనుభవంలో ఇక అది శరీరమనిగానీ ప్రపంచమనిగానీ విశేషదృష్టి కవకాశమే లేదు ముక్తుడికి.

   జీవన్ముక్తుడవలంబించే అనితర సాధారణమైన వ్యవహారాన్నే అత్యద్భుతంగా చిత్రించారు తన శత శ్లోకిలో ఒకచోట ఆచార్యులవారు. “ఆత్మాం భోధేస్తరంగో స్మ్యహ మితి గమనే భావయన్” ఒక చోటికి వెళ్ళేటపుడల్లా తన ఆత్మ చైతన్యమనే సాగరంలో నుంచి పైకి లేచిన ఒక తరంగమే అలా వెళుతూన్నట్టు భావిస్తాడట. “ఆసనస్థ స్సంవిత్సూత్రాను విద్ధో మణిరహ మితి వాస్మి” కదలకుండా ఉన్నచోట కూచొని ఉన్నప్పుడంతా ఆత్మ సంవేదన అనే దారంలో కూర్చిన ఒక రత్నంలాగా తన్ను భావిస్తాడట. “ఇంద్రియార్థ ప్రతీతా దృష్టో స్మ్యాత్మావ లోకాదితి" మరి తన చక్షురాది కరణాలకూ ఈ బాహ్యప్రపంచానికీ సంసర్గమేర్పడుతున్నప్పుడల్లా

Page 186