ఇలాంటి స్వానుభవాన్నే బయటపెట్టారా అనిపిస్తుందొక ఘట్టంలో ఆ పరమహంస పరివ్రాజకులు అనుక్షణ “యథా భూతాత్మ దర్శన నిష్ఠస్సన్ శరీర స్థితిమాత్ర ప్రయోజనే భిక్షాటనాదౌ కర్మణి
శరీరాది నిర్వర్త్యే-నైవకించిత్క రోమ్యహమ్ -గుణా గుణేషు వర్తంత ఇత్యేవమ్ సదా
పరి సంచక్షాణః ఆత్మనః కర్తృత్వా భావమ్ పశ్యన్ నైవకించి ద్భిక్షాటనాదికమ్ కర్మ
కరోతి. లోక వ్యవహార సామాన్య దర్శనేనకు లౌకికైరేవ ఆరోపిత కర్తృత్వే భిక్షాటనాదౌ
కర్మణి కర్తాభవతి. స్వానుభవేనతు శాస్త్రప్రమాణ జనితేన అకర్తైవ స ఏవమ్
పరాధ్యారోపిత కర్తృత్వః శరీరస్థితి మాత్ర ప్రయోజనమ్ భిక్షాటనాదికమ్ కర్మ కృత్వాపి
నని బధ్యతే - బంధహేతోః కర్మణః సహేతుకస్య జ్ఞానాగ్నినా దగ్ధత్వాత్”
భిక్షటనాదికమైన ఏపని చేస్తున్నా ఇది నేను గాదు చేయటం. ప్రకృతి గుణాలైన
ఇంద్రియాలు ప్రకృతి గుణాలైన విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అనుక్షణమూ భావిస్తూ
కర్తృత్వాభిమానాన్ని వదులుకొంటాడు జ్ఞాని. అలాంటప్పుడాభిక్షాటనాది కర్మలు
చేస్తున్నా ఏదీ చేయని వాడే. అయితే లోకసామాన్య దృష్ట్యా లౌకికులారోపించిన
కర్తృత్వం వల్ల అతడు కర్త అవుతున్నాడు. మరి శాస్త్ర ప్రమాణంవల్ల ఏర్పడిన తన
అనుభవ దృష్ట్యా చూస్తే మాత్రమతడు దేనికీ కర్తకాడు. ఈ విధంగా
ఇతరులధ్యారోపించిన కర్తృత్వంతో భిక్షాటనాది క్రియా కలాపం నిర్వరిస్తున్నా అతని
కాకర్మ బంధకం కానేరదు. కారణం బంధహేతువైన కర్మను సహేతుకంగా వాడికి
కలిగిన బ్రహ్మజ్ఞానమనే అగ్ని కాల్చివైచింది. ఇక ముక్తుడు కాకవాడు బబ్ధుడెలా
అవుతాడు. శరీరమున్నా - దానితో ఒకక్రియ చేస్తున్నట్టు కనిపించినా వాడు ముక్తుడే.
ఎంత గొప్ప అనుభవమిది. ఇలాంటి అనుభవాన్ని భగవత్పాదులు దహరించారంటే ఇది వారొక్కరిదే గాదు. సృష్టిలో ఎంతమంది భగవత్పాదులలాంటి మహనీయులందరికీ ఇలాంటి అనుభవమే కలిగి ఉండాలి. ఇక మీదట కూడా కలిగి తీరాలి. ఇందుకు నిత్యముక్తుడైన కృష్ణ భగవానుని మధురగీతలే మనకు సాక్ష్యం. “కర్మణ్యభిప్రవృత్తోపి నైవకించి త్కరోతిసః - శరీరస్థోపి కౌంతేయ కర్మభిర్న సబధ్యతే-నవ ద్వారేపురే దేహే నైవకుర్వన్నకారయన్" ఇలాంటి వాక్యాలు బాగా విమర్శించి చేస్తే శరీరమనేది ఒకటి ఉన్నా దానితో నిత్యమూ కార్యకలాపం నిర్వర్తిస్తున్నా అది జీవన్ముకుడి విషయంలో కర్మేగాదు నిర్వర్తించటమే గాదని తేటపడుతున్నది. దానికి కారణం నవద్వారమైన ఈ శరీరమనే పట్టణంలోనే ఉన్నా దానినంటీ ముట్టకుండా బాటసారి ఒక సత్రంలో బస చేస్తున్నట్టుగా భావిస్తాడతడు.
Page 184