ఆ తరువాత చూస్తామన్నా కనిపించదది. కాకున్నా అసలీ జన్మలో ఎంతో వయసు చెల్లిన తరువాతగాని కలగదు మనకు జ్ఞానం. కలిగిన తరువాత ఇక ఎంత ప్రారబ్దమని. ఎంతకాలం బ్రతుకుతామని. "తస్య తావ దేవ చిరమాయావ న్నవి మోక్ష్యే" అని ఘోషిస్తున్న దుపనిషత్తు. ఎంతో కాలముండదు జ్ఞానోదయమైన తరువాత ప్రారబ్ధం. అదుగో ఇదుగో మని చూస్తుండగానే దాని బాకీ తీరిపోతుంది మనకు. “అధ సంపత్స్యే” తీరటమేమిటి. సదేకరూపులమై ప్రకాశించటమేమిటి. ఏక కాలంలో జరిగిపోతుంది. అంచేత శరీరమింకా ఉంటుందే ఎలాగా అని కంగారు పడనక్కరలేదు. ఉంటే ఉండనీయండి. ప్రారబ్ధంతో వచ్చిందది. ప్రారబ్ధమున్నంత కాలమూ దాని ననుభవించటానికీ ఉపాధి ఉండవలసిందే ప్రారబ్ధం పోతే అదే పోతుందంటారు భగవత్పాదులు.
అయితే అది ఇక ముక్తి ఎలా అయిందని అడగవచ్చు. ముక్తి అనేది శరీరముండటం లేకపోవటంతో లేదు. అది ఉన్నట్టు మనం భావించకపోతే చాలు. అదే ముక్తి అని ఇంతకుముందే వక్కాణించాము. శరీరమే నేననే తాదాత్మ్య బుద్ధి లేదా అభిమానమనేదే ప్రమాదం. అది లేకపోతే శరీరమున్నా ఫరవాలేదని శంకరుల వాదం. అయితే శరీరమున్నంత వరకూ అభిమానమెలా లేకపోతుందని చాలామంది కనుమానం. ఎందుకంటే శరీరమనే ఉపాధిఎప్పుడుందో అప్పుడది నాదనే బుద్ధి తప్పకుండా కలుగుతుంది. దాని కేర్పడే క్షుత్పిపాసలు నా అనుభవానికి రాకపోవు. అంతేగాక ఆధ్యాత్మికాదులైన బాధలెన్నో ఉంటాయి. వాటన్నిటికీ అది గురి అయినప్పుడల్లా ఆ అనుభవం మనకు సోకి తీరుతుంది. అసలనుభవమనేది మనకే గదా. అచేతనమైన శరీరానికనుభవమేముంది. మరి ఇలా అన్నీ అనుభవించవలసి వస్తే అది ఇక సంసారమే గదా మోక్షమెలా అవుతుందని ఆక్షేపణ.
అది కూడా అవిచార మూలకమేనని కొట్టివేస్తారు భగవత్పాదులు. ఆయన చెప్పేదేమంటే శరీరమున్నప్పటికీ ఆ శరీరమే నేననే అభిమానం లేదు ముక్తుడికి. అభిమానమెప్పుడు లేదో దానికి కలిగే బాధలికేవీ తనవిగా భావించడు. కష్టసుఖాలన్నీ దానికే వదలివేసి తాను వాటికి సాక్షిగా ఉండిపోతాడు. అంతేకాదు.
Page 182