అయితే ఒక ఆక్షేపణ. సరే మీ మాట ప్రకారం జీవన్ముక్తి నొప్పుకొంటాము. బాగానే ఉంది. కాని ముక్తి అంటే ఇంతకుముందు మనలనంటి పట్టుకొన్న ఉపాధులన్నీ లయమైపోవాలి గదా మరి ఈ శరీరమనే ఉపాధి ఎలా ఉండగలదు. ఉంటే ఇక ముక్తి అనే మాట కర్ధమేముంది. ఆ మేరకు మరలా అది బంధమే గదా. నిజమే. శరీరమనే ఉపాధి కూడా న్యాయమైతే తొలగిపోవలసిందే. సందేహంలేదు. కాని జీవుడి ప్రారబ్ధ కర్మవల్ల అది ఇంకా తొలగకుండా అలాగే నిలిచి ఉందంటారు శంకరులవారు. ఇంకా వాడికి కర్మ ఎక్కడిదని ఆశ్చర్యపడరాదు. కర్మఅనేది మూడు విధాలుగా ఉంటుందని మొదటనే చెప్పాము. మూడింటిలో అటు సంచితమూ-ఇటు ఆగామీ ఇవి రెండూ జ్ఞానోదయం కాగానే దగ్ధమయిపోతాయి. కూడబెట్టిన కర్మ పుంజమంతా పోయి ఇక దానికి కూడేది లేదు. కాబట్టి జ్ఞానికిక కర్మ నిమిత్తంగా జన్మ అంటూ ఉండబోదు. అంతవరకూ ఖాయం. పోతే ఈ వర్తమాన జన్మ మాత్రమప్పుడే మాఫీకాదు. కారణమేమంటే ఇది ప్రారబ్దం చేత తయారయిన పదార్ధం. ప్రారబ్ధమంటే అంతకు ముందుగానే జారీ అయిందని గదా పేర్కొన్నాము. అది జారీ అయి కూచున్న దాయె. అంచేత దాన్ని ఇది ఏమీ చేయలేదు. దాని ఫలితమది ఇచ్చి తీరుతుంది.
అయితే అలా ఇస్తూపోతే ఏమిటి మన గతి అని నిర్వేద పడనక్కరలేదు మరలా. “ప్రారబ్దమ్ భోగతో నశ్యేత్త న్నారు పెద్దలు. ఫలానుభవం పూర్తి కాగానే దానిపాటికదే సమసిపోతుంది. “ముక్తేషువ” తన్నారు శంకరులు. ప్రారబ్ధమనేది విడిచిపెట్టిన బాణం లాంటిదట. బాణం విడిచిన తరువాత మధ్యలో మనం కాదనుకొన్నా దానినిక వెనుకకు తీసుకోలేము. మంచో చెడ్డీ అది దాని లక్ష్యాన్ని పోయి భేదించవలసిందే. భేదించేంతవరకూ ప్రయాణం చేయక తప్పదది. అయితే ఆ ప్రయాణం కూడా ఎంతో కాలముంటుందనే భయం మనకక్కరలేదు. వేగమున్నంతవరకే అది. లక్ష్యాన్ని తగిలి భేదించగానే అది తన వేగాన్ని కోలుపోయి నేలమీద పడిపోతుంది. అలాగే ఒక కుమ్మరి సారెలాగా ఈ శరీరంకూడా ప్రారబ్ధకర్మ వేగం పని చేసినంతవరకూ భూమిమీద క్రుమ్మరుతు ఉంటుంది. ఆ వేగం తీరగానే ఇది తీరిపోతుంది.
Page 181