#


Back

   అందరూ అలాగే అయిన నాడిక ముక్తి అనేది ఒకటి ఉందని మాత్రమేమి నమ్మకం. జీవితంలో మనకది ఎక్కడా దృష్టం కావటం లేదుగదా. జీవితంలోనే కాకపోతే రేపీ శరీర పాతమైన తరువాతనైనా కలుగుతుందో లేదో. చెప్పలేము. “దృష్టాచ్చ అదృష్ట సిద్ధిః” అంటారు భాష్యకారులు. ఎప్పుడైనా దృష్టమైన విషయాన్ని ఆధారంచేసుకొనే అదృష్టమైన అర్ధాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ప్రస్తుత మీ ముక్తి అనేది జీవితంలోనే దృష్టం కాదంటున్నారు. అలాంటప్పుడిక దాని విషయంలో మనకు ప్రామాణ్యబుద్ధి ఎలా ఏర్పడుతుంది. ప్రామాణ్యబుద్ధి లేకుంటే గురుశిష్య సంప్రదాయం దెబ్బ తింటుంది. సంప్రదాయ Tradition మంటే కేవల విద్యా దానమే గాదు. అనుభవ ప్రధానం కూడా. అనుభవమే దుర్లభమయినప్పుడెవరి కెవరు దానం చేయాలది.

   అసలు ముక్తి అంటే ఏమిటి. అది పూర్వసిద్ధమేగాని ఇప్పుడు సరిక్రొత్తగా నిష్పన్నమయ్యేది కాదు స్వరూపమే గదా మనకది. స్వరూప మన్నప్పుడిక క్రొత్తగా దాన్ని పొందేదేముంది. ఆవరణం Veil తొలగితే చాలు. దాని పాటికదే బయట పడుతుంది. దానికున్న ఆవరణ మజ్ఞానమే. అది బ్రహ్మజ్ఞానం చేత కకా వికలమయి పోయింది. పోతే అది ఇక వెంటనే మన అనుభవానికి రావాలి గదా. అలా కాక దేహపాతమయ్యే వరకూ కనిపెట్టుకొని ఉండవలసి వస్తే ఇక మనకు జ్ఞానమనేది కలిగి ప్రయోజనమేముంది. జ్ఞానోదయమైనా ముక్తి లభించలేదని చెప్పినట్టువుతుంది. జ్ఞానోదయానంతరమేదో ఒక క్రియ చేసి తన్మూలంగా దాని నార్జింవచవలసి వస్తే అది యధార్ధమే. కాని జ్ఞానానంతరం వేరే ఒక క్రియ కూడా కావలసి ఉందని చెప్పటం లేదు అద్వైతులు. జ్ఞానమజ్ఞానాన్ని పారదోలితే చాలు. అది ఇక ముక్తేనంటారు. అలాంటప్పుడిక శరీర పాతందాకా వేచి ఉండటం దేనికి. పైగా జ్ఞానం మన కుత్పన్నం కావాలంటే దానికి శరీరాద్యుపకరణాలుండాలి. అవి ఉన్నప్పుడే కలగని జ్ఞానం రేపు ఆ పరికరాలన్నీ పోయిన తరువాత కలగటమెలా సంభవం. జ్ఞానమే కలగకపోతే తన్నిమిత్తమైన ముక్తికెలా నోచుకోగలం. కాబట్టి శరీరాద్యుపాధులున్నా ముక్తి నొప్పుకోక తప్పదు.

Page 180